మన తెలంగాణ/మోత్కూర్: యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్ మండలంలోని పాలడుగు, పనకబండ, రాగిబాయి గ్రామాల్లో జాతీయ ఉపాధి హామీ పథకం కింద చేపట్టాల్సిన పనులు, సీసీ రోడ్ల నిర్మాణాలను స్థానిక ఎమ్మెల్యే మందుల సామేల్ కావాలనే అడ్డుకుంటున్నారని బీజేపీ మండల అధ్యక్షుడు గూదే మధుసూదన్ యాదవ్ విమర్శించారు. శనివారం మోత్కూర్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ పాలడుగు సర్పంచ్ రెబల్ అభ్యర్థి కావడంతో వ్యక్తిగత అక్కసుతో అభివృద్ధి కార్యక్రమాలను నిలిపివేస్తున్నారన్నారు. రాజకీయ ద్వేషాలతో గ్రామాల అభివృద్ధిని బలిచేయడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమన్నారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి కల్పనతో పాటు మౌలిక సదుపాయాల అభివృద్ధికి కీలకంగా అమలు చేస్తున్న జాతీయ ఉపాధి హామీ పథకం పనులను అడ్డుకోవడం అత్యంత దురదృష్టకరం అన్నారు. ఈ పరిస్థితుల్లో వెంటనే సంబంధిత ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని నిలిచిపోయిన ఉపాధి హామీ పనులు, సీసీ రోడ్ల నిర్మాణాలను ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే తీరును తీవ్రంగా ఖండిస్తూ, అభివృద్ధి పనులను అడ్డుకోవడం పూర్తిగా అన్యాయమని పేర్కొన్నారు. రాజకీయాలకు అతీతంగా ప్రజల సంక్షేమం కోసం పనిచేయాలని, లేకపోతే ప్రజల ఆగ్రహానికి గురవ్వాల్సి వస్తుందని హెచ్చరించారు.