నీట్ ప్రశ్నపత్రం లీకేజీపై కాక్రోచ్ జనతా పార్టీ (సిజెపి) నేతృత్వంలో దేశవ్యాప్తంగా జరిగిన ఆందోళనల నేపథ్యం లో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడంతో ఒక రాజకీయ వివాదం ముగిసినట్లయింది. కానీ ఈ ఆందోళన వెనుక ఉన్న అసలు సమస్యలకు మాత్రం ఇంకా పరిష్కారం లభించలేదు. దేశవ్యాప్తంగా విద్యార్థులు, యువత పెద్దఎత్తున వీధుల్లోకి రావడం కేవలం పరీక్షల్లో జరిగిన అక్రమాలపై వ్యక్తమైన ఆగ్రహం మాత్రమే కాదు. ఏళ్ల తరబడి చదువుకున్నా, అభివృద్ధిపై ఎన్నో హామీలు విన్నా తమ భవిష్యత్తుపై భరోసా కనిపించడం లేదన్న ఒక తరం ఆవేదనకు ఈ ఉద్యమం అద్దం పట్టింది. యువత ఆగ్రహం నిష్పాక్షికంగా పరీక్షలు నిర్వహించాలన్న డిమాండ్‌కే పరిమితం కాలేదని ఈ ఉద్యమం స్పష్టం చేసింది. నిరుద్యోగం, తగ్గిపోతున్న అవకాశాలు, పెరుగుతున్న ఆర్థిక అసమానతలు, ఆర్థిక భద్రత కల్పించడంలో ప్రభుత్వంపై సన్నగిల్లుతున్న విశ్వాసం వంటి అనేక సమస్యలు యువతను వేధిస్తున్నాయి. ఏళ్లుగా ఉపాధి అవకాశాలు పెరగని అభివృద్ధి కారణంగా పేరుకుపోయిన అసంతృప్తికి నీట్ వివాదం ఒక నిప్పురవ్వలా మారింది.

ప్రభుత్వానికి చెందిన పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే (పిఎల్‌ఎఫ్‌ఎస్) తాజా గణాంకాలు కూడా సమస్య తీవ్రతను తెలియజేస్తున్నాయి. 1529 ఏళ్ల మధ్య వయసున్న యువతలో నిరుద్యోగిత రేటు 2026 ఏప్రిల్‌లో 13.8 శాతంగా ఉండగా, జూన్ నాటికి 16.2 శాతానికి పెరిగింది. ఇదే సమయంలో యువతలో కార్మిక శక్తి భాగస్వామ్య రేటు 42.7 శాతం నుంచి 40.3 శాతానికి తగ్గడం మరింత ఆందోళన కలిగించే విషయం. ఉద్యోగం దొరుకుతుందన్న ఆశలేక చాలామంది యువత ఉద్యోగ ప్రయత్నాలనే విరమించుకుంటున్న పరిస్థితిని ఈ గణాంకాలు సూచిస్తున్నాయి. భారత్ ఎదుర్కొంటున్న ఉపాధి సంక్షోభంలో అత్యంత ఆందోళన కలిగించే అంశం ఇదే. సాధారణంగా ఉద్యోగాల కోసం ప్రయత్నించే వారి సంఖ్య తగ్గినప్పుడు నిరుద్యోగిత రేటు కూడా తగ్గాలి. కానీ ప్రస్తుతం అందుకు విరుద్ధంగా జరుగుతోంది.

ఉద్యోగాల కోసం వెతుకుతున్న వారి సంఖ్య తగ్గుతున్నప్పటికీ నిరుద్యోగిత పెరుగుతోంది. కొత్త ఉద్యోగాల కల్పన ఎంత బలహీనంగా ఉందో దీన్నిబట్టి అర్థమవుతోంది. ఇది ఒకటి రెండు నెలలకు పరిమితమైన పరిణామం కూడా కాదు. పిఎల్‌ఎఫ్‌ఎస్ వార్షిక గణాంకాల ప్రకారం దేశంలోని 36 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 13 చోట్ల 2022తో పోలిస్తే 2025లో యువత నిరుద్యోగిత పెరిగింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఢిల్లీ, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాల్లో ఈ పెరుగుదల గణనీయంగా ఉంది. యువకులతో పోలిస్తే యువతులు ఉపాధి పొందడంలో మరిన్ని అడ్డంకులను ఎదుర్కొంటున్నారు. ఇవన్నీ తాత్కాలిక ఆర్థిక మందగమనం వల్ల తలెత్తిన సమస్యలు కావని, దేశ ఉపాధి వ్యవస్థలోనే లోతైన సమస్యలు ఉన్నాయని సూచిస్తున్నాయి.

దశాబ్దానికి పైగా ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా భారత్ తన స్థానాన్ని చాటుకుంటోంది. దేశ స్థూల జాతీయోత్పత్తి (జిడిపి) వృద్ధి బలంగా కొనసాగుతోంది. మౌలిక వసతుల ప్రాజెక్టులు విస్తరించాయి. డిజిటల్ లావాదేవీలు భారీగా పెరిగాయి. స్టాక్ మార్కెట్లు పలుమార్లు రికార్డు స్థాయులను తాకాయి. అయితే ఈ ఆర్థిక ప్రగతి అందుకు తగిన స్థాయిలో ఉపాధి అవకాశాలను మాత్రం సృష్టించలేకపోయింది. ఉత్పత్తి పెరుగుతున్నా, అందుకు అనుగుణంగా ఉద్యోగాలు పెరగని ఈ పరిస్థితిని ఆర్థికవేత్తలు ‘ఉపాధి రహిత వృద్ధి’గా పేర్కొంటున్నారు. దీనికి కారణాలు కూడా స్పష్టంగానే కనిపిస్తున్నాయి. భారీగా కార్మికులు అవసరం లేని పరిశ్రమలు, ఆటోమేషన్, డిజిటల్ సాంకేతికత, పెద్ద కార్పొరేట్ పెట్టుబడులు ఇటీవలి ఆర్థిక వృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. మరోవైపు గతంలో లక్షలాది మందికి ఉపాధి కల్పించిన వస్త్ర, దుస్తులు, తోలు, ఆహార శుద్ధి, చిన్నతరహా తయారీ రంగాలు వరుస ఆర్థిక ఒడిదుడుకుల నుంచి ఇంకా పూర్తిగా కోలుకోలేకపోయాయి. దేశంలోని మొత్తం శ్రామికశక్తిలో దాదాపు 90% మందికి ఉపాధి కల్పిస్తున్న అసంఘటిత రంగం కూడా తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటోంది. అంతర్జాతీయ సంస్థలు ఇటీవల నిర్వహించిన అధ్యయనాలు కూడా గత దశాబ్ద కాలంలో భారత్‌లో సంపద అసమానతలు గణనీయంగా పెరిగినట్లు వెల్లడిస్తున్నాయి.

సమాజంలోని కొద్దిమంది వద్ద ఎన్నడూ లేనంత సంపద పోగవుతుండగా, మరోవైపు లక్షలాది కుటుంబాలు పెరుగుతున్న ఆహార ధరలు, వైద్య ఖర్చులు, విద్యా వ్యయాలతో ఇబ్బందులు పడుతున్నాయి. ఫలితంగా ఆర్థిక వృద్ధి ఫలాలు అందరికీ సమానంగా అందడం లేదు. ముఖ్యంగా యువతకు ఆర్థిక ప్రగతి అందించే సుసంపన్నమైన భవిష్యత్తు ఇంకా అందని ద్రాక్షగానే కనిపిస్తోంది. ఈ సంక్షోభం దేశ విద్యావ్యవస్థలో మరింత స్పష్టంగా కనిపిస్తోంది. చదువుకుంటే జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవచ్చనే ఆశతో ఏటా లక్షలాది మంది విద్యార్థులు పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాల నుంచి పట్టాలు పొందుతున్నారు. కానీ చదువు పూర్తయ్యాక ఉద్యోగాల కోసం ప్రయత్నించినప్పుడు వారికి నిరాశే ఎదురవుతోంది. మంచి ఉద్యోగాలు తక్కువగా ఉండటంతో పాటు నియామక ప్రక్రియల్లో జాప్యం, పరీక్షల రద్దు, పదేపదే ప్రశ్నపత్రాల లీకేజీలు యువత ఆశలను దెబ్బతీస్తున్నాయి.

అజీమ్ ప్రేమ్‌జీ విశ్వవిద్యాలయం విడుదల చేసిన ‘స్టేట్ ఆఫ్ వర్కింగ్ ఇండియా’ నివేదిక కూడా ఆందోళనకర పరిస్థితిని వెల్లడిస్తోంది. చదువు పూర్తిచేసిన ఏడాదిలోపు శాశ్వత వేతన ఉద్యోగం పొందుతున్న పట్టభద్రులు ఏడు శాతం కంటే తక్కువేనని నివేదిక పేర్కొంది. స్థిరమైన వైట్‌కాలర్ ఉద్యోగాలు పొందే అవకాశాలు మరింత తక్కువగా ఉన్నాయి. దీంతో లక్షలాది మంది చదువుకున్న యువత ప్రభుత్వ ఉద్యోగమే లక్ష్యంగా ఏళ్ల తరబడి పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నారు. ప్రైవేటు రంగంలో తక్కువ వేతనాలు, కాంట్రాక్టు ఉద్యోగాలు, ఉద్యోగ భద్రత లేకపోవడం కూడా ప్రభుత్వ ఉద్యోగాల వైపు యువత మొగ్గు చూపడానికి కారణమవుతోంది. ఈ నేపథ్యంలో నీట్‌తో పాటు ఇతర నియామక పరీక్షల్లో పదేపదే వెలుగుచూస్తున్న ప్రశ్నపత్రాల లీకేజీలు రాజకీయంగా కూడా తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి.

ఏళ్లుగా పేరుకుపోయిన ఈ అసంతృప్తిని కాక్రోచ్ జనతా పార్టీ (సిజెపి) నేతృత్వంలోని ఉద్యమం దేశవ్యాప్త నిరసనగా మార్చగలిగింది. వేలాదిమంది విద్యార్థులు, తొలిసారి ఆందోళనల్లో పాల్గొన్న యువత, యువ ఉద్యోగులు ఈ ఉద్యమంలో భాగస్వాములయ్యారు. జవాబుదారీతనం కోసం చేసిన డిమాండ్‌తోపాటు తమ ఆర్థిక భవిష్యత్తుపై యువతలో నెలకొన్న ఆందోళన కూడా ఈ ఉద్యమానికి ప్రధాన కారణమని వారి భాగస్వామ్యం స్పష్టం చేసింది. విద్యాశాఖ మంత్రి పదవి నుంచి తొలగించడం యువత ఆకాంక్షలకు స్పందించే రాజకీయ వ్యవస్థ కావాలన్న విస్తృత డిమాండ్‌కు ఒక ప్రతీకగా మారింది. భారత్ ప్రస్తుతం జనాభాపరంగా అత్యంత కీలకమైన దశలో ఉంది. దేశజనాభాలో దాదాపు మూడింట రెండొంతుల మంది 35 ఏళ్లలోపు వారే. ఈ యువ జనాభాను భారత్‌కు ఉన్న అతిపెద్ద బలంగా చాలాకాలంగా చెబుతున్నారు. అయితే యువ జనాభా ఎక్కువగా ఉన్నంత మాత్రాన దాని ప్రయోజనాలు వాటంతట అవే అందవు. యువత ఆరోగ్యంగా, విద్యావంతులుగా ఉండటంతోపాటు వారికి ఉపాధి అవకాశాలు లభించినప్పుడే జనాభా ప్రయోజనం (డెమోగ్రాఫిక్ డివిడెండ్) దేశ ప్రగతికి దోహదపడుతుంది. ఉపాధి లేకపోతే అదే యువశక్తి నిరాశ, సామాజిక అశాంతి, ఆర్థిక మందగమనానికి దారితీసే భారంగా మారే ప్రమాదం ఉంది. అందువల్ల అధిక జిడిపి వృద్ధిని సాధించడం ఒక్కటే భారత్ ముందున్న లక్ష్యం కాకూడదు. పెద్దఎత్తున ఉపాధి అవకాశాలను సృష్టిస్తూ, అన్ని వర్గాలనూ అభివృద్ధిలో భాగస్వాములను చేసే సమ్మిళిత వృద్ధి అవసరం.

ఇందుకోసం పెద్ద సంఖ్యలో ఉద్యోగాలను సృష్టించగల సమగ్ర ఉపాధి వ్యూహం అవసరం. ఎక్కువ మందికి ఉపాధి కల్పించే తయారీ రంగాలకు ప్రాధాన్యం ఇవ్వాలి. గ్రామీణ ప్రాంతాల్లో పారిశ్రామికీకరణను ప్రోత్సహించాలి. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలను విస్తరించడంతో పాటు సంప్రదాయ పరిశ్రమలకు అండగా నిలవాలి. ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను పారదర్శకంగా, నిర్ణీత గడువులో భర్తీ చేయాలి. ఆరోగ్యం, విద్య, పునరుత్పాదక ఇంధనం, పట్టణ మౌలిక వసతులు, సంరక్షణ సేవల రంగాల్లో ప్రభుత్వ పెట్టుబడులను పెంచితే ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడటంతో పాటు లక్షలాది నాణ్యమైన ఉద్యోగాలు సృష్టించే అవకాశం ఉంటుంది. విద్యారంగంలో సంస్కరణలు కూడా అంతే అవసరం. మారుతున్న ఉద్యోగ మార్కెట్ అవసరాలకు అనుగుణంగా విద్యార్థుల్లో నైపుణ్యాలను పెంపొందించేందుకు విశ్వవిద్యాలయాలు వృత్తి విద్య, అప్రెంటిస్‌షిప్‌లు, పరిశ్రమలతో భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయాలి.

యువత సొంతంగా ఉపాధి అవకాశాలను సృష్టించుకునేలా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించాలి. సంస్థాగత రుణాలు సులభంగా అందేలా చూడటం, నిబంధనలను సరళీకరించడం, మహానగరాలకే పరిమితం కాకుండా ఇతర ప్రాంతాల్లోని స్టార్టప్‌లకు కూడా తగిన ప్రోత్సాహం అందించడం అవసరం. ఆర్థిక వృద్ధి ఫలాలు అన్ని వర్గాలకూ అందడం కూడా అంతే ముఖ్యం. సామాజిక భద్రతను బలోపేతం చేయాలి. ఉపాధి హామీ కార్యక్రమాలను విస్తరించాలి. అందుబాటు ధరల్లో వైద్యం, విద్య లభించేలా చర్యలు తీసుకోవాలి. పెద్ద కార్పొరేట్ సంస్థలతో పాటు రైతులు, కార్మికులు, అసంఘటిత రంగంలోని శ్రామికులు, చిన్న వ్యాపారులు కూడా అభివృద్ధి ఫలాలను పొందేలా విధానాలు ఉండాలి. ఒక మంత్రి రాజీనామా తక్షణ రాజకీయ డిమాండ్‌ను నెరవేర్చవచ్చు. కానీ దేశ యువత ఎదుర్కొంటున్న లోతైన సంక్షోభానికి అది పరిష్కారం కాదు. కాక్రోచ్ జనతా పార్టీ (సిజెపి) నేతృత్వంలోని ఆందోళన విధాన నిర్ణేతలు ఇకపై విస్మరించలేని వాస్తవాన్ని వెలుగులోకి తెచ్చింది. ఆ నినాదాలు, నిరసనల వెనుక ఒక తరం ఆకాంక్షలు ఉన్నాయి. ఆ యువత కోరుకుంటున్నది దానం కాదు అవకాశం. తాత్కాలిక ఉపశమనం కాదుగౌరవప్రదమైన ఉపాధి.

- గీతార్థ పాఠక్ (ఈశాన్యోపనిషత్) 

( రచయిత ఈశాన్య రాష్ట్రాల సామాజిక, అంశాల విశ్లేషకుడు)