అమరావతి: విధ్వంసం నుంచి వికాసం వైపు వెళ్తున్నాం ఎపి సిఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. వెంటిలేటర్ పై ఉన్న ఎపికి ప్రధాని నరేంద్ర మోడీ ఆక్సిజన్ ఇచ్చి నిలబెట్టారు అని విశాఖ స్టీల్ ప్లాంట్ ను కాపాడాం, రైల్వే జోన్ తీసుకొచ్చామని అన్నారు. ఈ సందర్భంగా భోగాపురం లో ఆయన మీడియాతో ప్రసంగించారు. విమానాశ్రయం ఉత్తరాంధ్రకు మణిహారం అని కొనియాడారు. ఉత్తరాంధ్ర విమానాశ్రయానికి భూములిచ్చిన రైతులకు పాదాభివందనం తెలియజేశారు. మన్యం వీరుడు అల్లూరి సీతారామ రాజు పేరు పెట్టుకున్నామని, ఉత్తరాంధ్ర శక్తికి ఈ ఎయిర్ పోర్టు నిదర్శనం అని చంద్రబాబు పేర్కొన్నారు. శంషాబాద్ ఎయిర్ పోర్టుతో తెలంగాణ దశాదిశా మారిందని చెప్పారు. ఎయిర్ పోర్టులో అడుగడుగునా తెలుగు సంస్కృతి కనిపిస్తోందని, భోగాపురానికి కొబ్బరికాయ కొట్టింది తామే, ఇప్పుడు గుమ్మడికాయ కొట్టింది మనమేనని ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఇకపై ఉత్తరాంధ్ర నుంచి వలసలు ఉండవు అని వేరే ప్రాంతం నుంచి ఉత్తరాంధ్రకు త్వరలో వలసలు వస్తాయని అన్నారు. ప్రపంచంలో ఐటీ నుంచి ఎఐకి షిప్ట్ అవుతోందని ఉత్తరాంధ్రకు ప్రపంచస్థాయి కంపెనీలు వచ్చాయని, 2027 లో పోలవరాన్ని పూర్తి చేస్తామని అన్నారు. 2028 లో అమరావతి మొదటి దశ ప్రారంభిస్తామని, దేశానికి సరైన సమయంలో సరైన నాయత్వం ఉందని చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.