
వ్యవసాయం ప్రకృతితో ముడిపడిన జీవన విధానం. వర్షం సకాలంలో పడితే రైతు ముఖంలో చిరునవ్వు విరుస్తుంది. అదే వర్షాలు ఎడతెరిపి లేకుండా కురిసినా, పూర్తిగా దూరమైనా వ్యవసాయం సంక్షోభంలో పడుతుంది. గత కొన్ని సంవత్సరాలుగా ప్రపంచవ్యాప్తంగా వాతావరణ మార్పులు తీవ్రమవుతున్నాయి. ఈ మార్పులకు తోడు ఎల్‌నినో వంటి వాతావరణ దృగ్విషయాలు భారతదేశ వ్యవసాయాన్ని మరింత సవాలుగా మారుస్తున్నాయి. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో వర్షపాతం తగ్గడం, ఉష్ణోగ్రతలు పెరగడం, భూగర్భ జలాలు క్షీణించడం రైతుల ఆందోళనను పెంచుతున్నాయి. ఎల్‌నినో ప్రభావం అంటే కేవలం వర్షాలు తగ్గడమే కాదు. రుతుపవనాల తీరు మారుతుంది. వర్షాలు పడాల్సిన సమయంలో పడకపోవడం, ఒకేసారి అధిక వర్షాలు కురవడం, పంటల పెరుగుదల దశలో తీవ్ర ఉష్ణోగ్రతలు నమోదవడం వంటి పరిస్థితులు ఏర్పడతాయి. ఫలితంగా విత్తనాల నుంచి కోత వరకు ప్రతి దశలో రైతు అనిశ్చితిని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ పరిస్థితుల్లో ‘సాంప్రదాయ సాగు విధానాలు కొనసాగించాలా? లేక వాతావరణ మార్పులకు అనుగుణంగా సాగును మార్చుకోవాలా?’ అనే ప్రశ్న అత్యంత కీలకంగా మారింది. దీనికి సమాధానం స్పష్టమే. ప్రకృతి మారుతున్నప్పుడు వ్యవసాయం కూడా మారాల్సిందే.
గతంలో వర్షాధారంగా సాగుచేసిన వరి, చెరకు వంటి అధిక నీటి అవసరమున్న పంటలను అన్ని ప్రాంతాల్లో యథాతథంగా సాగు చేయడం ఇకపై ఆర్థికంగా కూడా, పర్యావరణపరంగా కూడా సాధ్యం కాదు. వర్షపాతం తక్కువగా ఉన్న ప్రాంతాల్లో ప్రత్యామ్నాయ పంటలపై దృష్టిపెట్టడం కాలానుగుణ అవసరం. జొన్న, సజ్జ, రాగులు, కొర్రలు, సామలు వంటి చిరుధాన్యాలు తక్కువ నీటితోనే మంచి దిగుబడిని ఇస్తాయి. పెసర, మినుము, కంది, శనగ వంటి పప్పుధాన్యాలు కూడా తక్కువ వర్షపాతాన్ని తట్టుకుని సాగు చేయవచ్చు. వేరుశెనగ, నువ్వులు, ఆముదం వంటి నూనెగింజల పంటలు కూడా అనేక ప్రాంతాలకు అనుకూలంగా ఉంటాయి. అంతేకాకుండా మామిడి, జామ, సీతాఫలం, దానిమ్మ వంటి ఉద్యాన పంటలు, డ్రిప్ ఇరిగేషన్‌తో సాగుచేసే కూరగాయల పంటలు కూడా రైతులకు ప్రత్యామ్నాయ ఆదాయ వనరులుగా నిలుస్తాయి.
అయితే పంట మార్చడం ఒక్కటే పరిష్కారం కాదు. సాగు పద్ధతుల్లో కూడా మార్పులు రావాలి. తక్కువ వ్యవధిలో పండే వంగడాలు, వాతావరణాన్ని తట్టుకునే విత్తనాలు, నేలలో తేమను నిలుపుకునే మల్చింగ్ విధానం, డ్రిప్, స్ప్రింక్లర్ వంటి సూక్ష్మనీటిపారుదల పద్ధతులు విస్తృతంగా అమలు చేయాలి. ప్రతి గ్రామంలో చెరువులు, కుంటలు, వర్షపు నీటి సంరక్షణ నిర్మాణాలను పునరుద్ధరించడం అత్యవసరం. ‘ప్రతి నీటి బొట్టును ఆదా చేయడం’ ఇకపై నినాదం మాత్రమే కాదు, వ్యవసాయ మనుగడకు ప్రాథమిక సూత్రంగా మారాలి. రైతులు కూడా సంప్రదాయ అనుభవంతోపాటు శాస్త్రీయ సమాచారాన్ని అందిపుచ్చుకోవాలి. వాతావరణ హెచ్చరికలు, వర్షపాతం అంచనాలు, మార్కెట్ పరిస్థితులను పరిశీలించి సాగు నిర్ణయాలు తీసుకోవాలి. వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, కృషి విజ్ఞాన కేంద్రాలు, వ్యవసాయ శాఖ అధికారులు అందించే సలహాలను వినియోగించుకోవాలి. ఒకే పంటపై ఆధారపడకుండా పంటల వైవిధ్యీకరణ, పశుపోషణ, కోళ్లపెంపకం, చేపలపెంపకం వంటి అనుబంధ రంగాలను కలిపి వ్యవసాయం చేయడం ద్వారా ఆదాయంలో స్థిరత్వం సాధించవచ్చు. కష్టకాలంలో ప్రభుత్వ పాత్ర అత్యంత కీలకం. కేవలం నష్టపరిహారం ప్రకటించడం సరిపోదు.
ముందస్తు ప్రణాళికలతో రైతును సిద్ధం చేయడం ప్రభుత్వ బాధ్యత. ఏ ప్రాంతంలో ఎంత వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందో అంచనా వేసి, అందుకు అనుగుణంగా ప్రత్యామ్నాయ పంటల ప్రణాళికలను ముందుగానే ప్రకటించాలి. రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, సూక్ష్మనీటిపారుదల పరికరాలపై అధిక సబ్సిడీ ఇవ్వాలి. ప్రతి మండలంలో వాతావరణ సమాచార కేంద్రాలను ఏర్పాటు చేసి రైతులకు మొబైల్ సందేశాల ద్వారా తక్షణ సమాచారం అందించాలి. పంట బీమా పథకాలను మరింత పారదర్శకంగా, సులభంగా అమలు చేయాలి. నష్టం జరిగిన వెంటనే పరిహారం రైతు ఖాతాలో జమ అయ్యే విధానాన్ని బలోపేతం చేయాలి. నీటి వనరుల అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించి చెరువులు, కాలువలు, చిన్న నీటిపారుదల ప్రాజెక్టులను పునరుద్ధరించాలి. వాతావరణ మార్పులను ఎదుర్కొనే పరిశోధనలకు ప్రభుత్వాలు అధిక ప్రాధాన్యం ఇవ్వాలి. అయితే రైతుకు అత్యంత కీలకమైన ప్రశ్న ఒక్కటే ‘పండించిన పంటకు మార్కెట్ ఉంటుందా?’ ప్రత్యామ్నాయ పంటలు వేయమని చెప్పడం సులభం. కానీ వాటికి గిట్టుబాటు ధర, కొనుగోలు వ్యవస్థ లేకపోతే రైతు మళ్లీ నష్టాల బాటలోనే నడవాల్సి వస్తుంది. అందువల్ల మార్కెట్ సంస్కరణలు కూడా సమాంతరంగా జరగాలి. చిరుధాన్యాలు, పప్పుధాన్యాలు, నూనెగింజల కొనుగోలుకు ప్రభుత్వ సంస్థలు ముందుకు రావాలి. కనీస మద్దతు ధర ప్రకటించడమే కాకుండా గ్రామ స్థాయిలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలి. రైతు ఉత్పత్తిదారుల సంఘాలు (ఎఫ్‌పిఒలు) బలోపేతం కావాలి. నిల్వ గోదాములు, కోల్డ్ స్టోరేజీలు, ప్రాసెసింగ్ యూనిట్లు పెరగాలి. విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీకి ప్రోత్సాహం ఇవ్వాలి.
ఎగుమతి అవకాశాలు ఉన్న పంటలకు ప్రత్యేక మార్కెటింగ్ వ్యూహం రూపొందించాలి. డిజిటల్ మార్కెట్లు, ఈ-వ్యాపార వేదికలు రైతును నేరుగా వినియోగదారుడితో అనుసంధానించే విధంగా పనిచేయాలి. వాతావరణ మార్పులు శాశ్వత సవాలుగా మారుతున్న ఈ కాలంలో వ్యవసాయం కూడా శాస్త్రీయ దిశగా అడుగులు వేయాలి. రైతు, శాస్త్రవేత్త, ప్రభుత్వం, మార్కెట్ ఈ నాలుగు వ్యవస్థలు సమన్వయంతో పనిచేస్తేనే వ్యవసాయం నిలదొక్కుకుంటుంది. ఎల్‌నినోను అడ్డుకోవడం మన చేతిలో లేకపోవచ్చు. కానీ దాని ప్రభావాన్ని తగ్గించే ప్రణాళికలు రూపొందించడం మాత్రం మన చేతిలోనే ఉంది. వ్యవసాయం కేవలం ఒక వృత్తి కాదు; అది దేశ ఆహార భద్రతకు పునాది. రైతు నిలబడితేనే దేశం నిలబడుతుంది. అందుకే వాతావరణ మార్పులను సంక్షోభంగా కాకుండా, వ్యవసాయ సంస్కరణలకు ఒక అవకాశంగా మలచుకోవాలి. తక్కువ నీటితో ఎక్కువ దిగుబడి, శాస్త్రీయ సాగు, పంటల వైవిధ్యీకరణ, గిట్టుబాటు మార్కెట్, సమర్థవంతమైన ప్రభుత్వ విధానాలు - ఈ ఐదు సూత్రాలే రేపటి భారత వ్యవసాయాన్ని సుస్థిరంగా నిలబెట్టే మార్గదర్శకాలు. రైతు చేతిలో విజ్ఞానం, ప్రభుత్వ చేతిలో దూరదృష్టి, మార్కెట్‌లో న్యాయం కలిసివస్తే ఎల్‌నినో వంటి సవాళ్లను కూడా భారత వ్యవసాయం విజయవంతంగా ఎదుర్కోగలదు.
తిప్పర్తి శ్రీనివాస్
99484 39565











