
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర అసెంబ్లీ, కౌన్సిల్ వర్షాకాల సమావేశాలు వచ్చే నెల రెండో వారంలో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. సాధారణంగా వర్షాకాల సమావేశాలు ఆగస్టులోనే జరుగుతుంటాయి. పైగా రాజ్యాంగం ప్రకారం ప్రతి సమావేశాలకు ఆరు నెలల గడువు ముగియరాదన్న నియమం ఉంది. ఆ గడువు సెప్టెంబర్ నెలలో ముగియనున్నది. ఈ ఏడాది కూడా గడువులోగా నిర్వహించాల్సి ఉంటుంది. ఇదిలాఉండగా చట్ట సభలకు పోటీ చేసే వారి వయోపరిమితిని 25 నుంచి 21 ఏళ్ళకు తగ్గించాలని కేంద్రాన్ని కోరుతూ ఆగస్టు మొదటి వారంలో అసెంబ్లీలో బిల్లు (తీర్మానం) ఆమోదించి పంపిస్తామని ఇటీవల ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి నెక్లెస్ రోడ్డులో విద్యార్థులనుద్ధేశించి హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే.
కాబట్టి ఈ అంశంపై కూడా అసెంబ్లీ, కౌన్సిల్‌లో చర్చించే అవకాశం ఉంది. అనంతరం ఉభయ సభల నిర్ణయాన్ని కేంద్రానికి పంపిస్తారు. కాగా ఆగస్టు మొదటి వారంలో సమావేశాల నిర్వహణ సాధ్యం కాకపోవచ్చని కొంత ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. అందుకు కారణం అసెంబ్లీ, కౌన్సిల్‌కు మధ్య సెంట్రల్ హాలు నిర్మాణం పనులు, కొన్ని మరమ్మత్తు పనులు ఇంకా పూర్తి కావడానికి మరో పదిహేను నుంచి ఇరవై రోజులు పట్టే అవకాశం ఉంది. కాబట్టి అసెంబ్లీ, కౌన్సిల్ సమావేశాల నిర్వహణకు వచ్చే నెల 17వ తేదీ నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఈ లోగా బోనాల పండుగ, స్వాతంత్య్ర దినోత్సవం కూడా పూర్తి అవుతుందని ముఖ్యమంత్రి భావిస్తున్నట్లు సమాచారం.











