
లక్ష్మీదేవిపల్లి మండల పరిధిలోని చాతకొండ గ్రామంలో సోమవారం జరిగిన వీధికుక్కల దాడిలో ఒక మహిళ ప్రాణాలు కోల్పోయింది. కుటుంబసభ్యులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన మారే రాములమ్మ (50) రోజువారీ పనుల కోసం పొలానికి వెళ్తుండగా కుక్కల గుంపు ఆమెపై దాడి చేసింది. ఆమెను కుక్కలు పలు చోట్ల తీవ్రంగా కొరకడంతో పాటు తల భాగాన్ని చిధ్రం చేశాయి. ఆమె కేకలు విన్న స్థానికులు పరుగున వచ్చి కుక్కలను తరిమికొట్టి రాములమ్మను వెంటనే 108 వాహనంలో సమీపంలోని ప్రైవేట్ దవాఖానకు తరలించారు.
అక్కడి వైద్యుల సూచన మేరకు కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాగా మార్గమధ్యలోనే రాములమ్మ మృతిచెందింది. గత కొంతకాలంగా గ్రామంలో వీధికుక్కల సంఖ్య విపరీతంగా పెరిగిందని, అవి గుంపులుగా తిరుగుతూ ప్రజలపై దాడులకు పాల్పడుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు వెంటనే స్పందించి గ్రామంలోని వీధికుక్కలను నిర్మూలించాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు.











