
మన తెలంగాణ/హైదరాబాద్‌ః ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని హుటాహుటిన హస్తినకు రావాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆదేశించినట్లు సమాచారం. అయితే సోమవారం నుంచి అసెంబ్లీ, కౌన్సిల్ సమావేశాలు ప్రారంభంకానున్నందున, సమావేశాలు వాయిదా పడిన తర్వాత ఢిల్లీకి వెళ్ళేందుకు ఆయన సమాయత్తమవుతున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి. సమావేశాలు ముగిసిన వెంటనే మంత్రివర్గ విస్తరణ చేపట్టే అవకాశాలు ఉన్నాయన్న ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే.
ఈ సమయంలో ఢిల్లీకి రావాల్సిందిగా ముఖ్యమంత్రికి అధిష్టానం నుంచి పిలుపు రావడంతో ఈ ఊహగానాలు మరింత బలపడుతున్నాయి. రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిణామాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో అధిష్టానం చర్చలు జరపనున్నది. ఇంకా మంత్రివర్గ విస్తరణ విషయంలో చర్చించే అవకాశం ఉంది. అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలువురు కేంద్ర మంత్రులను కలిసి పెండింగ్ పనుల విషయంలో చర్చించి, ఆ మర్నాడు హైదరాబాద్‌కు చేరుకుంటారని తెలుస్తోంది.








