
వేసవికాలంలో పల్లీలను పచ్చిగా లేదా వేయించుకుని తినడానికి బదులుగా నానబెట్టి తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. పల్లీలు రాత్రంతా నీటిలో నానబెట్టడం వల్ల శరీరానికి చల్లదనాన్ని అందిస్తుంది. తరచుగా వీటిని ఈ సీజన్ లో తినడం వల్ల శరీరానికి తగినంత శక్తి లభిస్తుంది. గుండె ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. ఈ నేపథ్యంలో వేసవిలో నానబెట్టిన పల్లీలను తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
వేసవిలో నానబెట్టిన పల్లీలు తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు
1. పచ్చి పల్లీలలో ఫైటిక్ యాసిడ్ అనే పదార్థం ఉంటుంది. ఇది కడుపులో భారంగా, గ్యాస్‌కు కారణమవుతుంది. కాబట్టి, వీటిని నీటిలో నానబెట్టి తినడం వల్ల ఈ యాసిడ్ తొలగిపోతుంది. దీనివల్ల పల్లీలలోని ఫైబర్ సులభంగా జీర్ణమవుతుంది. వేసవిలో సాధారణంగా వచ్చే మలబద్ధకం, అజీర్ణం, ఎసిడిటీ నుండి ఉపశమనం కలిగిస్తుంది.
2. నానబెట్టే ప్రక్రియ పల్లీలలోని విటమిన్లు, ఖనిజాలను క్రియాశీలం చేస్తుంది. నానబెట్టిన పల్లీలలో ఉండే ఐరన్, కాల్షియం, విటమిన్ ఇ, పొటాషియంలను శరీరం సులభంగా గ్రహించి, సంపూర్ణ పోషణను అందిస్తుంది.
3. వేసవిలో అధిక ఎండ, చెమట కారణంగా శరీరం తరచుగా నీరసంగా మారుతుంది. నానబెట్టిన పల్లీలలో ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు పుష్కలంగా ఉంటాయి. ఉదయాన్నే ఖాళీ కడుపుతో వీటిని తినడం వల్ల జీవక్రియ మెరుగుపడి, రోజంతా శక్తివంతంగా ఉండేలా చేస్తుంది.
4. నానబెట్టిన పల్లీలలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు, గుండెను రక్షించే గుణాలు ఉంటాయి. ఇవి శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి, మంచి కొలెస్ట్రాల్‌ను పెంచడంలో సహాయపడతాయి. క్రమం తప్పకుండా వీటిని తీసుకోవడం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడి, గుండె జబ్బుల ప్రమాదం తగ్గుతుంది.
5. నానబెట్టిన పల్లీలలో విటమిన్ ఇ, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి వేసవిలో చర్మ కణాలను దెబ్బతినకుండా కాపాడతాయి. ఇది ముడతలను నివారిస్తుంది. అలాగే జుట్టు రాలడాన్ని తగ్గించి, వెంట్రుకలను బలంగా చేస్తుంది.
నానబెట్టిన పల్లీలను తీసుకునే విధానం
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందించే నానబెట్టిన పల్లీలను తీసుకునే విధానానికి వస్తే, రోజూ రాత్రి గుప్పెడు పల్లీలను తీసుకొని మంచి నీటిలో నానబెట్టుకోవాలి. తర్వాత ఉదయాన్నే ఖాళీ కడుపుతో వీటిని తినవచ్చు.











