సూపర్ స్టార్ కృష్ణ మనవడు, మహేష్ బాబు అన్న కుమారుడు జై కృష్ణ ఘట్టమనేని... అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కిన ‘శ్రీనివాస మంగాపురం’ సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు. బాలీవుడ్ నటి రవీనా టాండన్ కుమార్తె రాషా తడాని కూడా ఈ చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. నిర్మాత పి. కిరణ్ నిర్మించిన ఈ చిత్రాన్ని వైజయంతి మూవీస్ బ్యానర్‌పై అశ్విని దత్ సమర్పించారు. ఈ చిత్రం గురువారం ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమా ద్వారా జై కృష్ణ ఘట్టమనేని హిట్‌ను అందుకున్నాడా?.. ఈ సినిమా ఏ మేరకు ప్రేక్షకులను అలరించిందో తెలుసుకుందాం.

కథ: శ్రీను (జైకృష్ణ) కొత్తగా తిరుపతిలో అడుగు పెట్టిన కుర్రాడు. అతను సిటీలో ఉన్న చాలా పెద్ద వ్యక్తుల్లో ఒకరైన పెద్దిరెడ్డి (కిక్ శ్యామ్) కూతురైన మంగ (రషా తడాని)ను తొలి చూపులోనే ప్రేమిస్తాడు. అదే పనిగా తన వెంట పడుతున్న శ్రీనును మంగ మొదట పట్టించుకోదు. తర్వాత అతను చేసిన ఒక సాయం వల్ల ఫ్రెండ్‌గా అంగీకరిస్తుంది. అనంతరం మంగకు శ్రీను ప్రపోజ్ చేయగా.. ఆమె తిరస్కరిస్తుంది. తనకు ఇదివరకే పెళ్లి ఫిక్స్ అవడంతో.. ఆ వివాహమే చేసుకోవాలనుకుంటుంది. కానీ శ్రీను.. పట్టువదలడు. అసలు అతను తిరుపతికి వచ్చిందే మంగకోసమని తెలుస్తుంది. ఇంతకీ శ్రీను ఎవరు.. తన కథేంటి.. మంగతో తనకున్న కనెక్షన్ ఏంటి.. అతను కోరుకున్నట్లుగా మంగను దక్కించుకున్నాడా అన్నది మిగతా కథ.

కథనం, విశ్లేషణ: ఈ సినిమాలో లవ్ ట్రాక్, ఎమోషన్స్ ప్రేక్షకులకు కొత్త అనుభూతిని కలిగిస్తాయి. జై కృష్ణ, రాషా జంటపై డిజైన్ చేసుకున్న ప్రేమ కథ, అందులోని ఎమోషన్‌ని దర్శకుడు బాగా ఆవిష్కరించాడు. జై కృష్ణ తన నటనతో ఆకట్టుకున్నాడు. తన డాన్స్‌లు , యాక్షన్ బాగున్నాయి. తనతో పాటుగా రాషా కూడా అంతే బాగా నటించి మెప్పించింది. వీరితో పాటుగా మోహన్ బాబు సినిమాకి అదనపు బలాన్ని అందించారు. గతాన్ని మర్చిపోయిన హీరోయిన్ల కథలు తెలుగులో కొన్ని వచ్చాయి. తమ ప్రేమను మర్చిపోయిన ఆమెకు గతాన్ని గుర్తు చేసి హీరో... హీరోయిన్‌ని తనదానిని చేసుకోవడం ఎన్నో సినిమాల్లో చూశాం. కాకపోతే... దర్శకుడు అజయ్ భూపతి కాస్తంత భిన్నమైన స్క్రీన్ ప్లేలో దీన్ని చూపించి అలరించాడు.

సినిమాలో హీరో ఇంట్రడక్షన్ సీన్ ఆసక్తికరంగా ఉంది. అలానే హీరోయిన్ మనసు దోచుకునే క్రమంలో హీరో పడే తపన కూడా బాగానే ఉంది. ద్వితీయార్థంలో హీరోయిన్ గతాన్ని గుర్తు చేసిన విధానం, హీరో నేపథ్యం ప్రేక్షకులను అలరిస్తాయి. ప్రేక్షకులను ఆద్యంతం ఆకట్టుకుంటూ కథను చకచకా నడిపేశాడు దర్శకుడు. జైకృష్ణ సింపుల్ కుర్రాడి పాత్రలో ఒదిగిపోయే చక్కగా నటించి ప్రేక్షకులను అలరించాడు. హీరోయిజం చూపించే సన్నివేశాల్లో రాణించాడు. ఎమోషనల్ సీన్లలో చక్కగా నటించాడు. ఆద్యంతం అలరించిన ‘శ్రీనివాస మంగాపురం’ సినిమాతో జైకృష్ణ హీరోగా మెప్పించాడు.