
అమెరికాలో చదువుకుంటున్న విదేశీ విద్యార్థులకు అధ్యక్షుడు డొనాల్ ట్రంప్ మరో షాక్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్‌పై లక్ష డాలర్ల ఫీజు విధించే అంశాన్ని పరిశీలిస్తున్నట్టు వాల్‌స్ట్రీట్ జర్నల్ ఒక కథనంలో తెలిపింది. హెచ్1-బి వీసాలపై లక్ష డాలర్ల ఫీజు విధించే ప్రతిపాదనను ఇటీవల అమెరికా కోర్టు కొట్టివేసిన నేపథ్యంలో ట్రంప్ యంత్రాంగం ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగు (ఓపీటీ)పై లక్ష డాలర్లు రుసుము విధించే ఆలోచన చేస్తున్నట్టు తెలిపింది. అమెరికా యూనివర్శిటీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకుని అక్కడే స్థిరపడాలని కోరుకునే వారికి ఈ ఓపీటీ తప్పనిసరి.
ఓపీటీ లేకుంటే విదేశీ విద్యార్థులు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వెంటనే దేశం విడిచిపెట్టి వెళ్లాల్సి ఉంటుంది. అయితే ఈ ఓపీటీ కింద జాబ్ చేస్తే హెచ్1-బి వీసాలకు అవకాశం ఉంటుంది. 2024 లెక్కల ప్రకారం సుమారు 4,19,000 విదేశీయులు ఓపీటీపై పనిచేస్తున్నారు. ప్రస్తుత సంవత్సరం లెక్కలు మాత్రం అందుబాటులో లేవు. కాగా, అమెరికా యూనివర్సిటీల నుంచి ఎక్కువగా రిక్రూట్‌మెంట్లు చేసుకుంటున్న టెక్ కంపెనీలు మాత్రం హెచ్1-బి వీసాలపై లక్ష డాలర్ల ఫీజును వ్యతిరేకిస్తున్నాయి.











