
పోటీ పరీక్షల ప్రశ్నాపత్రాల లీకేజీలు భారత విద్యా వ్యవస్థను వెంటాడుతున్న అతిపెద్ద సంక్షోభాల్లో ఒకటిగా మారాయి. ఏళ్ల తరబడి కష్టపడి చదివిన లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును క్షణాల్లో తలకిందులు చేసే ఈ దుర్వ్యవస్థకు కేవలం న్యాయపరమైన పరిష్కారాలు సరిపోవు. ప్రశ్నాపత్రం లీక్ అయిన తర్వాత ఫాస్ట్-ట్రాక్ కోర్టులు ఏర్పాటుచేసి నిందితులను వేగంగా శిక్షించడం అవసరమే అయినప్పటికీ, అది వ్యాధికి ఇచ్చే నొప్పి నివారణ మాత్ర మాత్రమే. అసలు వ్యాధి మాత్రం పరీక్షా వ్యవస్థలోని బలహీనతలు, జవాబుదారీతనం లోపించడం, లాభాపేక్షతో పెరిగిన అక్రమ నెట్‌వర్క్‌లు. వాటిని నిర్మూలించకపోతే సమస్య మళ్లీ మళ్లీ పునరావృతమవుతూనే ఉంటుంది. దేశంలో ప్రతి సంవత్సరం కోట్లాది మంది యువత ప్రభుత్వ ఉద్యోగాలు, ఉన్నత విద్యా ప్రవేశాలకోసం వివిధ పోటీ పరీక్షలు రాస్తున్నారు. ఈ పరీక్షలు వారి జీవితాలను నిర్ణయించే కీలక మలుపులు.
అలాంటి పరీక్షల్లో ప్రశ్నాపత్రం లీక్ కావడం అంటే కేవలం ఒక పరీక్ష రద్దు కావడం కాదు; అది ప్రతిభపై విశ్వాసానికి తూట్లు పొడవడం. నిజాయితీగా శ్రమించిన విద్యార్థిని, అక్రమ మార్గంలో ప్రశ్నాపత్రం సంపాదించిన వ్యక్తితో ఒకే స్థాయిలో నిలబెట్టడం. అంతకంటే పెద్ద అన్యాయం మరొకటి ఉండదు. ఇటీవలి కాలంలో దేశవ్యాప్తంగా పలు పరీక్షల విషయంలో లీకేజీలు, అవకతవకలు, పునఃపరీక్షలు, న్యాయపోరాటాలు సాధారణ వార్తలుగా మారిపోయాయి. పరీక్ష ముగిసిన తర్వాత ఫలితాల కోసం ఎదురుచూడటానికి బదులు, ‘లీక్ జరిగిందా?’, ‘పరీక్ష రద్దవుతుందా?’, ‘మళ్లీ పరీక్ష ఉంటుందా?’ అనే సందేహాలతో విద్యార్థులు గడపాల్సివస్తోంది. ఇది పరీక్షా వ్యవస్థపై ప్రజల్లో విశ్వాసం క్రమంగా క్షీణిస్తున్నదనే ప్రమాదకర సంకేతం. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఫాస్ట్-ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయాలనే నిర్ణయం ప్రకటించడం స్వాగతించదగినదే. నేరస్థులకు శిక్ష తప్పదనే సందేశం వెళ్లాలి. విచారణలు సంవత్సరాల తరబడి సాగి నిందితులు శిక్ష తప్పించుకునే పరిస్థితి ఉండకూడదు.
అయితే ప్రశ్న ఏమిటంటే -శిక్ష వేగంగా పడితే లీకేజీలు ఆగిపోతాయా? గతంలో శిక్షలు లేవా? చట్టాలు లేవా? ఉన్నా నేరాలు ఎందుకు ఆగలేదు? సమాధానం స్పష్టమే. సమస్య చట్టాల్లో కాదు; వాటి అమలులో, వ్యవస్థ నిర్వహణలో, పర్యవేక్షణలో ఉంది. ప్రశ్నాపత్రం లీక్ అనేది ఒక్క వ్యక్తి చేసే నేరం కాదు. ప్రశ్నాపత్రం తయారీ, ముద్రణ, భద్రత, రవాణా, నిల్వ, పంపిణీ, పరీక్షా కేంద్రాల నిర్వహణ -ఇలా అనేక దశల్లో వందలాది మంది పాల్గొంటారు. ఈ గొలుసులో ఒక్క లింకు బలహీనపడినా మొత్తం వ్యవస్థ కుప్పకూలుతుంది. అందువల్ల ప్రతి దశలో సాంకేతిక భద్రత, డిజిటల్ పర్యవేక్షణ, బాధ్యతల స్పష్టత, స్వతంత్ర ఆడిట్ వంటి సంస్కరణలు అత్యవసరం. మరో కీలక అంశం ప్రశ్నాపత్రాల లీకేజీల వెనుక ఉన్న అక్రమ ఆర్థిక వ్యవస్థ. ఒక ప్రశ్నాపత్రం లీక్ కావడం వెనుక లక్షల రూపాయలు కాదు, కొన్ని సందర్భాల్లో కోట్ల రూపాయల లావాదేవీలు జరుగుతున్నాయనే ఆరోపణలు తరచూ వినిపిస్తున్నాయి. కొందరు దీనిని లాభదాయకమైన వ్యాపారంగా మార్చుకున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
అలాంటప్పుడు కేవలం లీక్ చేసిన వ్యక్తిని అరెస్టు చేయడం సరిపోదు. ఈ అక్రమ నెట్‌వర్క్‌లకు ఆర్థికంగా మద్దతు ఇస్తున్న వారిని, కుమ్మక్కైన అధికారులను, సంబంధిత సంస్థలను కూడా వెలికితీసి కఠినంగా శిక్షించాలి. అక్రమంగా సంపాదించిన ఆస్తులను స్వాధీనం చేసుకోవడం, సంస్థలను బ్లాక్‌లిస్ట్ చేయడం వంటి చర్యలు కూడా అవసరం. ఈ సంక్షోభంలో ఎక్కువ నష్టపోతున్నవారు విద్యార్థులే. ఒక పరీక్ష కోసం నెలలు, సంవత్సరాల పాటు సిద్ధమవుతారు. కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులను భరిస్తూ కోచింగ్ ఫీజులు చెల్లిస్తాయి. ఉద్యోగం కోసం వయోపరిమితి దగ్గరపడుతున్న అభ్యర్థులకు ప్రతి పరీక్ష అమూల్యమైన అవకాశం. అలాంటి సమయంలో పరీక్ష రద్దు కావడం అంటే వారి జీవితంలో ఒక సంవత్సరం వెనక్కి వెళ్లినట్టే. ఈ మానసిక ఒత్తిడి, ఆర్థిక నష్టం, సమయ నష్టానికి ఎలాంటి పరిహారం ఉండదు. కోర్టు తీర్పు వచ్చినా, నిందితులకు శిక్ష పడినా, విద్యార్థి కోల్పోయిన సమయం తిరిగి రాదు.
కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా వ్యవస్థాగత సంస్కరణలను అత్యున్నత ప్రాధాన్యంగా తీసుకోవాలి. పరీక్షల నిర్వహణకు స్వతంత్ర పర్యవేక్షణ వ్యవస్థను ఏర్పాటు చేయాలి. ప్రశ్నాపత్రాల భద్రతకు అంతర్జాతీయ ప్రమాణాలు అమలు చేయాలి. కృత్రిమ మేధస్సు, డిజిటల్ ట్రాకింగ్, బహుళస్థాయి ఎన్‌క్రిప్షన్ వంటి ఆధునిక సాంకేతికతను వినియోగించాలి. ప్రతి పరీక్ష అనంతరం భద్రతా ఆడిట్ తప్పనిసరి చేయాలి. పరీక్షా సంస్థలు పారదర్శకంగా వ్యవహరించాలి. అనుమానాలు తలెత్తిన ప్రతిసారీ విద్యార్థులకు స్పష్టమైన సమాచారం అందించాలి. దేశ భవిష్యత్తు యువత చేతుల్లో ఉందని ప్రతి ప్రభుత్వం చెబుతుంది. అయితే యువత ప్రతిభను కాపాడే పరీక్షా వ్యవస్థను నిర్మించడం కూడా అంతే ముఖ్యమైన బాధ్యత.
ప్రశ్నాపత్రాల లీకేజీలు కొనసాగుతుంటే ప్రతిభపై నమ్మకం తగ్గుతుంది. కష్టపడి చదవడం కంటే అక్రమ మార్గాలు వెతికే సంస్కృతి పెరిగే ప్రమాదం ఉంది. అది కేవలం విద్యా వ్యవస్థకే కాదు, దేశ నైతిక విలువలకు కూడా ముప్పు. అందుకే ఇప్పుడు అవసరమైంది ఫాస్ట్-ట్రాక్ కోర్టులు మాత్రమే కాదు; ఫాస్ట్-ట్రాక్ సంస్కరణలు కూడా. నేరం జరిగిన తర్వాత శిక్షించడం కంటే, నేరం జరగకుండా వ్యవస్థను నిర్మించడం ప్రభుత్వ అసలు విజయంగా నిలుస్తుంది. విద్యార్థులు కోరుకుంటున్నది ఆలస్యమైన న్యాయం కాదు; పరీక్షా హాల్లోకి అడుగుపెట్టిన ప్రతి అభ్యర్థి తన ప్రతిభతోనే విజయం సాధిస్తాడనే అచంచలమైన విశ్వాసం. ఆ విశ్వాసాన్ని పునరుద్ధరించగలిగితేనే విద్యా వ్యవస్థపై ప్రజల నమ్మకం నిలుస్తుంది. లేకపోతే ఫాస్ట్-ట్రాక్ కోర్టుల తీర్పులు వస్తూనే ఉంటాయి, కానీ ప్రశ్నాపత్రాల లీకేజీలు కూడా ఆగకుండా కొనసాగుతూనే ఉంటాయి. దేశ భవిష్యత్తును కాపాడాలంటే న్యాయాన్ని వేగవంతం చేయడం సరిపోదు; వ్యవస్థను సరిదిద్దే ధైర్యం ప్రభుత్వానికి ఉండాలి.
- తిప్పర్తి శ్రీనివాస్
99484 39565











