25న బీహార్ బంద్ సందర్భంగా ఘటన

ప్రభుత్వాల వైఖరిపై రాహుల్, తేజస్వీ మండిపాటు

కేసులు పెట్టబోమన్న ప్రధాని హామీ ఏమైందని ప్రశ్న

న్యూఢిల్లీ/పాట్నా: ఈ నెల 25న బీహార్ బంద్ సందర్భంగా శివాన్ జిల్లాలో చోటుచేసుకున్న ఘటన తాజాగా దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. నీట్ పేపర్ లీక్‌కు వ్యతిరేకంగా ఆందోళన చేపట్టిన విద్యార్థులపై ఓ పోలీసు అధికారి ఎకె 47 రైఫిల్‌తో కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అయ్యాయి. ఈ ఘటనపై స్పందించిన ఉన్నతాధికారులు సదరు కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేశారు. కాల్పుల్లో ముగ్గురు తీవ్రంగా గాయపడగా, వారిని పాట్నాలోని జయప్రభ మేదాంత ఆసుపత్రికి తరలించారు.

గాయపడిన వారిలో 15 ఏళ్ల మహమ్మద్ ఆరిఫ్ అనే యువకుడు కూడా ఉన్నాడు. బంద్ కారణంగా దుకాణం మూసివేసి ఇంటికి తిరిగి వెళ్తుండగా మెడకు బుల్లెట్ తగిలిందని కుటుంబసభ్యులు తెలిపారు. వైద్యులు శస్త్రచికిత్స చేసి బుల్లెట్‌ను తొలగించారని, బాధితుడి ఆరోగ్య పరిస్థితిని వైద్యులు పర్యవేక్షిస్తున్నారని తెలిపారు.కాల్పుల ఘటనపై ప్రతిపక్ష నేతలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. బాధ్యులైన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ డిమాండ్ చేశారు.

సంబంధించిన వీడియోను నెట్‌లో షేర్ చేశాడు. లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కూడా ఈ ఘటనపై స్పందించారు. బీహార్‌లో నిరసన తెలుపుతున్న విద్యార్థులపై ఏకే-47తో కాల్పులు జరిపారని, వందలాది మంది విద్యార్థులను అరెస్టు చేసి వారిపై ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశారనే వార్తలు వస్తున్నాయని రాహుల్ గాంధీ మండిపడ్డారు. విద్యార్థులపై ఎలాంటి ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేయబోమని, వారిని విడుదల చేస్తామని ప్రధాని ఇచ్చిన హామీ ఏమైందని ఆయన ప్రశ్నించారు. హామీకి విరుద్ధంగా వారిపై క్రూరమైన దాడులు జరుగుతున్నాయని మండిపడ్డారు.