న్యూఢిల్లీ: నీట్ లీక్, విద్యార్థుల ఛలో పార్లమెంటు నిరసనలపై పోలీసుల లాఠీఛార్జి వ్యవహారం పార్లమెంటు ఉభయసభలను కుదిపేసింది. విపక్షాల ఆందోళనల మధ్య వర్షాకాల సమావేశాల రెండో రోజైన మంగళవారంనాడు కూడా ఎలాంటి సభా కార్యక్రమాలు జరక్కుండా ఉభయసభలు వాయిదా పడ్డాయి. లోక్‌సభలో ఉదయం ప్రశ్నోత్తరాల సమయం ప్రారంభం కాగానే విపక్ష సభ్యులు నీట్ ప్రశ్నాపత్రం లీక్, విద్యార్థులపై లాఠీచార్జికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

నిబంధనలకు లోబడి విపక్షాలకు అనుమతి ఇస్తామని స్పీకర్ ఓం బిర్లా నచ్చచెప్పినప్పటికీ విపక్షాలు పట్టువీడకపోవడంతో సభను మొదటిసారి ఆయన వాయిదా వేశారు. తిరిగి సభ ప్రారంభమైనప్పటికీ విపక్షాలు వెనక్కి తగ్గకపోవడంతో రెండోసారి సభను స్పీకర్ వాయిదా వేశారు. సభ మరోసారి సమావేశం కాగానే సభాపతి స్థానంలో ఉన్న దిలీప్ సైకియా విపక్షాలను తమ సీట్లలో కూర్చోవాలని విజ్ఞప్తి చేశారు. అయినప్పటికీ విపక్ష సభ్యులు శాంతించకపోవడంతో సభ బుధవారంనాటికి వాయిదా పడింది.

ఇటు రాజ్యసభలోనూ ఇదే తరహా పరిస్థితి కొనసాగింది. సభా కార్యక్రమాలు ప్రారంభం కాగానే రాజ్యసభలో కాంగ్రెస్ విపక్ష నేత మల్లికార్జున్ ఖర్గే పోలీసు చర్యను సభలో లేవనెత్తారు. అధికార పార్టీ సభ్యులు అడ్డుకోవడంతో విపక్షాలు సైతం నినాదాలు హోరెత్తించారు. దీంతో సభ పలుమార్లు వాయిదా పడింది. అనంతరం సభను బుధవారంనాటికి వాయిదా వేస్తున్నట్టు చైర్మన్ సీపీ రాధాకృష్ణన్ ప్రకటించారు.