న్యూఢిల్లీ: విద్యార్థులపై పోలీసులు బలప్రయోగానికి పాల్పడిన ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ దేశ యువతకు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని, కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో కలిసి పదవులకు రాజీనామా చేయాలని కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మంగళవారం డిమాండ్ చేశారు. పార్లమెంట్ ప్రాంగణంలో విలేకరులతో మాట్లాడిన ఆయన, విద్యార్థుల సమస్యపై చర్చ జరిపేందుకు తాను ఇతర ప్రతిపక్ష ఎంపీలతో కలిసి ఉదయం లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాను కలిసినట్లు తెలిపారు. ఈ అంశంపై పార్లమెంట్‌లో చర్చకు అనుమతి కోరగా, ప్రభుత్వం అభిప్రాయం తీసుకోవాల్సి ఉంటుందని స్పీకర్ చెప్పారని రాహుల్ వెల్లడించారు.

పార్లమెంట్‌లో చర్చ జరపాలంటే కూడా ప్రభుత్వ అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని స్పీకర్ చెప్పడం ఆశ్చర్యకరం అని వ్యాఖ్యానించారు. విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన కీలక అంశంపై నిరసన తెలుపుతున్న వారిపై పోలీసులు లాఠీచార్జి చేయడం భారతీయ విలువలకు విరుద్ధమని రాహుల్ విమర్శించారు. నిన్న జరిగిన ఘటనపై ప్రధాని ఇప్పటివరకు ఒక్క క్షమాపణ కూడా చెప్పలేదు. విద్యార్థులను ఈ విధంగా కొట్టించడం పూర్తిగా తప్పు అని అన్నారు.

దేశంలో విద్యా వ్యవస్థ, పోటీ పరీక్షల నిర్వహణ పూర్తిగా దెబ్బతిన్నాయని, ఇదే విషయాన్ని విద్యార్థులు నిరసనల ద్వారా చెబుతున్నారని ఆయన పేర్కొన్నారు. పరీక్షల వ్యవస్థను చెదలు పట్టిన భవనంలా మార్చేశారని ఆరోపించారు. నేను ఈ అంశంపై ఎన్నోసార్లు వివరాలతో మాట్లాడాను. అయినా ప్రధాని ఎందుకు మౌనంగా ఉన్నారు? విద్యార్థులకు క్షమాపణ చెప్పి, వారిపై పోలీసులతో దాడులు చేయించడం వెంటనే నిలిపివేయాలి అని రాహుల్ డిమాండ్ చేశారు.

దేశ యువతకు అవకాశాలు లేకుండా పోయాయని, ప్రస్తుతం పోటీ పరీక్షలే వారికి ఉన్న ఏకైక ఆశ అని, ఆ వ్యవస్థ కూడా దెబ్బతినడంతో వారి భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థులు కేవలం విద్యా వ్యవస్థ గురించే మాట్లాడటం లేదు. తమ భవిష్యత్తు గురించి ప్రశ్నిస్తున్నారు. అదానీ, అంబానీ ప్రభావం, ఆర్‌ఎస్‌ఎస్ విద్యా వ్యవస్థపై పెరుగుతున్న నియంత్రణ, విశ్వవిద్యాలయాల్లో ప్రచారకులు వైస్ ఛాన్సలర్లుగా నియమితులవుతున్న పరిస్థితుల వల్ల తమకు భవిష్యత్తు కనిపించడం లేదని వారు చెబుతున్నారు అని రాహుల్ వ్యాఖ్యానించారు.

ఒకవైపు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసే వేడుకలు చూస్తున్న యువతకు, మరోవైపు చిన్న వ్యాపారం ప్రారంభించడానికి కూడా అవకాశాలు లేవు. అందుకే వారు తమకు భవిష్యత్తు కావాలని కోరుతున్నారు. ఇది కేవలం విద్యా వ్యవస్థకు సంబంధించిన అంశం మాత్రమే కాదు.. దేశ యువత భవిష్యత్తుకు సంబంధించిన ఉద్యమం అని అన్నారు. విద్యార్థుల డిమాండ్లు పూర్తిగా సమంజసమైనవేనని, పోటీ పరీక్షల వ్యవస్థను బలోపేతం చేసి విద్యా వ్యవస్థలో సంస్కరణలు తీసుకురావాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. ప్రధాని ఆ దిశగా చర్యలు తీసుకోవడం బదులు మౌనం పాటించడం విచారకరమని విమర్శించారు.