
మన తెలంగాణ/హైదరాబాద్: అధికారం, ఓట్లు ఎక్కువగా ఇచ్చే శాఖలపైనే సాధారణంగా అందరికీ మక్కువ ఉంటుందని, ఓట్లు రావని తెలిసినా విద్యార్థుల భవిష్యత్తు, సమాజంలో మార్పు కోస మే తాను విద్యా శాఖ తీసుకున్నానని ముఖ్యమం త్రి ఎ.రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. కొందరు విద్యాశాఖకు మంత్రి లేడు అని, త్వరగా ఆ శాఖకు ఓ మంత్రిని కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారని, అయితే ఏ కారణంతో తాను విద్యాశాఖకు రాజీనామా చేయాలని ప్రశ్నించారు. గవర్నమెంట్ స్కూల్స్‌లో చేరుతున్న వారి సంఖ్య పెంచినందు కా.. నర్సరీ నుంచి 12 వతరగతి వరకు బ్రేక్‌ఫాస్ట్ ఇస్తున్నందుకా..? అని ప్రశ్నించారు. టీచర్ల నియామకం, ప్రమోషన్లు సక్రమంగా చేపట్టినందుకా.. ఐటీఐలను ఎటిసిలుగా మార్చినందుకా.. స్కిల్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేసినందుకా.. ప్రపంచంలోనే సక్సెస్ అయిన కార్పొరేట్ సంస్థల
యజమానులను స్కిల్స్ యూనివర్సిటీ బోర్డ్ ఆఫ్ మెంబర్స్ గా నియమించినందుకా..? అని అడిగారు. తాను ఎందుకు విద్యాశాఖకు రాజీనామా చేయాలో వాళ్లు తెలపాలని డిమాండ్ చేశారు. ఓట్ల కోసం, రాజకీయం కోసం తాను పని చేయడం లేదని సి ఎం స్పష్టం చేశారు. ప్రపంచంతో తెలంగాణ వి ద్యార్థులు పోటీ పడాలనేదే తన లక్ష్యం అని పేర్కొన్నారు. సమాజ మార్పునకే తాను విద్యాశాఖ బా ధ్యతలు తీసుకున్నానని తెలిపారు. 2034 వరకు తానే ముఖ్యమంత్రిగా ఉంటానని రేవంత్‌రెడ్డి పునరుద్ఘాటించారు. నాణ్యమైన విద్య అందించేందుకు అవసరమైన సలహాలు, సూచనలు అందించాలని కోరారు. టీచర్ ఇంటర్నేషనల్ ఎక్స్‌పోజర్ విజిట్ అండ్ ఎడ్యుకేషనల్ ఎక్స్‌చేంజ్ కార్యక్రమంలో భా గంగా ఫిన్లాండ్, జర్మనీ దేశాల్లో పర్యటించి వచ్చిన ఉపాధ్యాయులు సిఎం రేవంత్ రెడ్డితో ఎంసిహెచ్‌ఆర్‌డిలో గురువారం సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, నాణ్యమైన విద్య రాష్ట్రానికి పునాది అయితే, నైపుణ్యాలు అంతస్తుల్లాంటివి అని వ్యాఖ్యానించారు. రానున్న ఐదేళ్లు ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య అందిస్తామనే దీక్షను ఉపాధ్యాయులు తీసుకోవాలని కోరా రు. ప్రపంచ దేశాలు మన వైపు చూసేలా ప్రభుత్వ విద్యా సంస్థలను తీర్చిదిద్దాలని అన్నారు. దేశానికే ఆదర్శంగా తెలంగాణను తీర్చిదిద్దే లక్ష్యంతో పని చేయాలని కోరారు. రాష్ట్రంలో ఒక్కో విద్యార్థిపై సగటున రూ.1.08 లక్షలు వ్యయం చేస్తున్నామ ని, దానిని వారి అభివృద్ధికి పెట్టే పెట్టుబడిలా చూ డాలన్నారు. అంత మొత్తం ఖర్చు చేస్తున్నా విద్యార్థులు ప్రైవేట్ పాఠశాలలకు ఎందుకు వెళుతున్నారో ఆలోచించాలని పేర్కొన్నారు. తెలంగాణలో ప్రపంచ స్థాయి ప్రమాణాలతో కూడిన విద్యా వ్య వస్థ ఉండాలనే లక్ష్యంతోనే ఉపాధ్యాయులను విదే శీ పర్యటనలకు పంపుతున్నామని తెలిపారు. ఆయా దేశాల్లో పర్యటించి వచ్చిన ఉపాధ్యాయులు అక్కడి అనుభవాలను ఇక్కడ ఆచరణలో తీసుకురావాలని సూచించారు.
విద్య లేకపోవడమే వెనుకబాటుతనం
ఆస్తులు లేకపోవడం వెనుకబాటుతనం కాదని, విద్య లేకపోవడమే వెనుకబాటుతనమని తాము నిర్వహించిన సామాజిక, ఆర్థిక, విద్యా, ఉపాధి, కుల సర్వే తేల్చిందని సిఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఎకరాల కొద్ది భూమి, ఇతర ఆస్తులు ఉన్నా సమాజం ఎటు వెళుతుందో తెలియక వెనుకబడి పోతున్నారని, ఏ ఆస్తులు లేకపోయినా చదువుకొని ఉద్యోగాలు సాధించిన వారు ప్రపంచంతో పోటీ పడుతున్నారని అన్నారు. ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య అందించాలనే లక్ష్యంతోనే బ్రేక్‌ఫాస్ట్ స్కీంకు రూపకల్పన చేశామని చెప్పారు. తాము అధికారంలోకి వచ్చాక హాస్టల్ విద్యార్థులకు డైట్ ఛార్జీలు, కాస్మోటిక్ ఛార్జీలు పెంచామని పేర్కొన్నారు. 55 రోజుల్లోనే 11 వేల ఉపాధ్యాయుల నియామకాలు చేపట్టామని, ఉపాధ్యాయుల బదిలీలు, ప్రమోషన్లు ఇచ్చామని సిఎం గుర్తు చేశారు. ఐఎఎస్, ఐపీఎస్ అధికారుల మాదిరిగానే ప్రతి ఏటా 10 నుంచి 15 మంది ఉపాధ్యాయులను విదేశీ విద్యకు పంపిస్తామని తెలిపారు. అక్కడ నేర్చుకున్న జ్ఞానాన్ని ఇక్కడ విద్యార్థులకు పంచాలని సూచించారు.
విద్యార్థుల సమస్యలపై ఉపాధ్యాయ సంఘాలు కొట్లాడాలి
ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి తాను పాటుపడతానని, ఉపాధ్యాయ సంఘాలు విద్యార్థుల సమస్యలపై తనతో కొట్లాడాలని సిఎం రేవంత్ రెడ్డి కోరారు. ఉపాధ్యాయులు ఏ మండలానికి ఆ మండలం యూనిట్‌గా తీసుకొని, వచ్చే విద్యా సంవత్సరానికి అవసరమైన ప్రణాళిక రూపొందించాలని సూచించారు. విద్య నైపుణ్యం కాదని, విద్యతోపాటు నైపుణ్యం అందించేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు.
పేద విద్యార్థులు ప్రపంచంతో పోటీ పడాలనేదే నా ఆశయం
తెలంగాణ బిడ్డ పి.వి.నరసింహారావు కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు సర్వేలు గురుకుల పాఠశాలను ఏర్పాటు చేశారని సిఎం రేవంత్‌రెడ్డి అన్నారు. తర్వాత కాలంలో అదే నవోదయ విద్యాలయాలకు, గురుకుల పాఠశాలలకు నమూనాగా నిలిచిందని పేర్కొన్నారు. ఆ పాఠశాలలో చదువుకున్న వారు ఎందరో ఉన్నత స్థాయికి ఎదిగారని గుర్తు చేశారు. సాగు నీటి ప్రాజెక్టులను నెహ్రూ ఆధునిక దేవాలయాలుగా వర్ణించారని, నాడు నిర్మించిన నాగార్జున సాగర్, ఎస్సారెస్పీ వంటి ప్రాజెక్టుల ఫలితంగానే తెలంగాణలో ఈనాడు 2 కోట్ల 85 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం ఉత్పత్తి సాధ్యమైందని చెప్పారు. 80 వేల పుస్తకాలు చదివి కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు కూళేశ్వరం అయిందని విమర్శించారు. ప్రతి పేద విద్యార్థికి విద్యను అందించడంతో సరిపెట్టుకోకుండా వారిని ప్రపంచంతో పోటీ పడేలా తీర్చిదిద్దాలనేది
తన ఆశయమని సిఎం తెలిపారు. కొండారెడ్డిపల్లి వంటి మారుమూల పల్లె ప్రభుత్వ పాఠశాలలో చదివిన తాను తెలంగాణలోని 12 వేల పల్లెల్లోని పాఠశాల పిల్లలు ప్రపంచంతో పోటీ పడే స్థాయికి ఎదగాలని కోరుకుంటున్నానని అన్నారు.సమావేశానికి ముందు ఫిన్లాండ్, జర్మనీ దేశాలలో పర్యటించి వచ్చిన ఉపాధ్యాయుల బృందం ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్‌ను ముఖ్యమంత్రి వీక్షించారు. సమావేశంలో ప్రభుత్వ సలహాదారు కే.కేశవరావు, సిఎం ప్రిన్సిపల్ సెక్రటరీ ఎన్.శ్రీధర్, విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా, ఎంసిఆర్‌హెచ్‌ఆర్‌డి డైరెక్టర్ శాంతికుమారి, కళాశాల విద్యాశాఖ కమిషనర్ శ్రీదేనసేన,పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్, ఇంటర్ బోర్డు కార్యదర్శి అభిలాష అభినవ్,ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.











