
హైదరాబాద్: రెండున్నరేళ్ల కాంగ్రెస్ పాలనలో విద్యావ్యవస్థ కుప్పకూలిందని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ఆరోపించారు. 14 లక్షల మంది విద్యార్థులకు సిఎం రేవంత్ రెడ్డి వెన్నుపోటు పొడిచారని అన్నారు. రేవంత్ రెడ్డికి కెటిఆర్ ఘాటు లేఖ రాశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. ఫీజు రీయింబర్స్ మెంట్ రద్దు చేసేందుకే చీకటి జిఒ 7 అని బిసి,ఎస్టి, ఎస్సి, మైనారిటీ విద్యార్థుల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టారని విమర్శించారు. విద్యాశాఖను విధ్వంసం చేసేందుకే నీ దగ్గర పెట్టుకున్నావా? అని మాజీ సిఎం కెసిఆర్ స్కీములకే కాదని, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ పథకాలకు పాతరేస్తావా? అని గురుకులాలను దెబ్బతీసి..మరో వైపు ఉన్నత విద్యకు ఉరివేస్తావా? అని కెటిఆర్ ప్రశ్నించారు. దుర్మార్గమైన జిఒ 7ను వెంటనే వెనక్కి తీసుకుని క్షమాపణ చెప్పాలని సూచించారు. విద్యార్థి లోకం గర్జిస్తే రోడ్లపై తిరగలేరని గుర్తుపెట్టుకోండి అని హెచ్చరించారు. రూ.10 వేల కోట్ల ఫీజు బకాయిలను ప్రభుత్వం తక్షణమే విడుదల చేయాలని కెటిఆర్ డిమాండ్ చేశారు.













