
మన తెలంగాణ/ వికారాబాద్ బ్యూరో/దౌల్తాబాద్/హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తన సొంత నియోజకవర్గమైన కొడంగల్ పరిధిలో చేపడుతున్న పలు అభివృద్ధి పనులను మంగళవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. కొడంగల్ పరిధిలో ఎడ్యుకేషన్ హ బ్ ఏర్పాటు చేయాలన్న లక్ష్యంతో సుమారు రూ.800కోట్లకు పైగా విలువ చేసే కళాశాలల భవనాలు, బాలురు, బాలికలకు వేర్వేరుగా వసతిగృహాలు చేపడుతున్నారు. వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజవకర్గం పరిధిలోని దుద్యాల మండలం హకీంపేటలో దాదాపు 250 ఎకరాల విస్తీర్ణంలో చేపడుతున్న మహిళా డిగ్రీ కళాశాల, పారా మెడికల్, నర్సింగ్ కళాశాలలు, వాటికి అనుబంధ హాస్టళ్లు, మెడికల్ కళాశాల, బాలుర, బాలిక ల వసతిగృహాలు, వెటర్నరీ, ఇంజినీరింగ్ కళాశాలలు, ఈ కళాశాలకు బాలుర, బాలికల అనుబం ధ హాస్టళ్లు, అకడమిక్ బ్లాక్, యంగ్ ఇండియా ఇం టిగ్రేటెడ్ రెసిడెన్షియల్ హాస్టళ్లు, మెడికల్ కళాశాల, బాలుర, బాలికల వసతిగృహాలు, వెటర్నరీ, ఇంజినీరింగ్ కళాశాలలు, ఈ కళాశాలకు బాలుర, బాలికల అనుబంధ హాస్టళ్లు, అకడమిక్ బ్లాక్, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణాలను ఒక్కొక్కటిగా పరిశీలించి వాటి సమగ్ర వివరాలను సీఎం రేవంత్‌రెడ్డి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఎప్పటిలోగా పూర్తిచేస్తారో కూడా అధికారులు వివరించారు.
కళాశాలల నిర్మాణాలు 2027 నాటికి పూర్తిచేసేలా యుద్ధ ప్రాతిపదికన పనులు కొనసాగేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ అధికారులను ఆదేశించారు. వీటి నిర్మాణ పనులు పరిశీలించిన అనంతరం జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. నిర్మాణ పనులు నిదానంగా సాగడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. పనులు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ఎడ్యుకేషన్ హబ్‌లో ప్రతి ప్రాజెక్టుకు సంబంధించి నెలవారీ పురోగతిని ఎప్పటికప్పుడు తనకు తెలియజేయాలన్నారు. పనుల్లో అలసత్వం వహించే అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే బాధ్యులపై సస్పెన్షన్ వేటు వేయడానికి కూడా వెనుకాడొద్దన్నారు. భూములు కోల్పోయిన రైతులకు ప్లాట్ల కేటాయింపులో జాప్యంపై అధికారులపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. వచ్చే వారంలోగా ప్లాట్ల పట్టాలు లబ్ధిదారులకు అందజేయాలని ఆదేశించారు.
భూసేకరణకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలి
ఇరిగేషన్‌పై నిర్వహించిన సమీక్షలో భూసేకరణకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. ముఖ్యంగా మక్తల్, -నారాయణపేట-, కొడంగల్ ఎత్తిపోతల పథకానికి సంబంధించి అదనపు పంపుల ఏర్పాటుకు అవసరమైన సివిల్ పనులన్నింటికి వర్క్ ఆర్డర్ ఇచ్చి త్వరగా పూర్తిచేయాలని ఆదేశించారు. భూ సేకరణకు సంబంధించి సెప్టెంబర్‌లోగా భూ సేకరణ పూర్తిచేయాలని, అందుకు అవసరమైన ప్రత్యేక బృందాలు ఏర్పాటుచేసి భూ సేకరణ పూర్తిచేయాలని సూచించారు. 3వ పంపు ఏర్పాటుకు అవసరమైన సివిల్ పనులన్ని జరిగాయో, లేదో క్షేత్రస్థాయికి వెళ్లి తనిఖీ చేయాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. పనుల విషయంలో తప్పుడు సమాచారం ఇస్తే సస్పెండ్ చేస్తానని హెచ్చరించారు. ఫేస్-1 పనులు డిసెంబర్ వరకు పూర్తిచేస్తామని చెప్పిన ఇంజినీరింగ్ అధికారులు తెలిపారు. డిసెంబర్ 2027 వరకు ప్రతి నెల ఎంత మేర పనులు పూర్తిచేయగలుగుతారో సంతకాలతో సహా వివరాలు సమర్పించాలన్నారు.
ఓఆర్‌ఆర్‌పై సమీక్ష
రంగారెడ్డి-, వికారాబాద్-, నారాయణపేట ఔటర్ రింగ్ రోడ్ల నిర్మాణంలో అన్ని శాఖల సమన్వయంతో చర్చించి డిజైన్లు రూపొందించాలని సూచించారు. రోడ్డుకు సంబంధించిన భూసేకరణ సెప్టెంబర్ 2026లోగా పూర్తిచేయనున్నట్లు అధికారులు తెలిపారు. భూ సేకరణ పూర్తయిన వెంటనే టెండర్ ప్రాసెస్ మొదలుపెట్టాలన్నారు. భూ సేకరణలో భాగంగా రైతులను ఒప్పించి కాన్సెంట్ అవార్డుకు వెళ్తే రైతులకు ఎక్కువగా నిధులు వచ్చే అవకాశం ఉందని రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. జిల్లా కలెక్టర్లు ఈ విషయంపై సమన్వయం చేసుకోవాలని సూచించారు. 2028, ఆగస్టు 15 నాటికి పూర్తిచేసిన నిర్మాణాలను ప్రారంభించాలని ఆదేశాలు జారీచేశారు.
ఇండ్రస్ట్రీయల్ పార్కుపై..
కొడంగల్ నియోజకవర్గంలో చేపట్టనున్న మల్టీపర్పస్ ఇండస్ట్రియల్ పార్కులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్షించారు. దుద్యాల ఇండస్ట్రియల్ పార్కుకు అవసరమైన భూ సేకరణపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్నారు. ఇండస్ట్రియల్ పార్కుల నిర్మాణంలో టీజీఐఐసీ చురుకైన పాత్ర పోషించాలని సూచించారు. భూసేకరణ విషయంలో నిర్లక్ష్యం వహిస్తే అవసరమైతే అక్టోబర్‌లో పనితీరు ఆధారంగా కలెక్టర్లను బదిలీచేస్తామని హెచ్చరించారు. జిల్లా కలెక్టర్లు క్షేత్రస్థాయిలో కూర్చుని భూసేకరణ పూర్తి చేయాలన్నారు. కొడంగల్ నియోజకవర్గంలో ఎడ్యుకేషన్ హబ్ , ఇండస్ట్రియల్ పార్కులు ఏర్పాటుచేయడంతో హైదరాబాద్, ఇతర ప్రాంతాల నుంచి కూడా విద్యార్థులు ఇక్కడికి వచ్చి చదువుకునేందుకు అవకాశం ఉంటుందన్నారు. ఇందుకు రోడ్లు, మౌలిక సదుపాయాలన్ని కల్పించాల్సి ఉందని తెలిపారు.
రోడ్ల నిర్మాణం, అభివృద్ధిపై ప్రారంభమైన సమీక్ష
ఎడ్యుకేషన్ హబ్‌కు రోడ్ల సౌకర్యం అత్యంతర అవసరమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ముంబై పుణె కనెక్టివిటీ మాదిరిగానే శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి కొడంగల్ కనెక్టివిటి రోడ్డు అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలన్నారు. హకీంపేట్ ఎడ్యుకేషన్ హబ్‌లో సుమారు 7 వేల మంది విద్యార్థులు చదివే అవకాశం ఉంది. అందుకు తగ్గట్లుగా రహదారులు ఉండాలి, ఇవి రేడియల్ రోడ్డుపైనే ఆధారపడి ఉన్నాయని స్పష్టం చేశారు. రోడ్ల నిర్మాణానికి సంబంధించిన భూ సేకరణ ప్రక్రియ సెప్టెంబర్ 26 నాటికి పూర్తి చేయాలన్నారు. కొడంగల్ నియోజకవర్గంలోని 8 మండలాలలో అవసరమైన ఆర్ అండ్ బీ రహదారుల మంజూరుకు ఆర్ అండ్ బీ ఇంజినీరింగ్ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రతిపాదనలు పంపించాలన్నారు. 2028 జూన్ 2 నాటికి అన్ని రోడ్లు నిర్మించాలన్నారు. తనకు నియోజకవర్గంలో అన్ని రోడ్లు తెలుసు, అవసరమైతే సందు, సందు తిరుగుతాను. ప్రతీ తండాకు రోడ్డు ఉండాలన్నారు. ఎంపీపీలు, జెడ్పీటీసీలు ఉన్నప్పుడు మండల సర్వసభ్యా సమావేశాలు నిర్వహించినట్టుగానే వికారాబాద్,
నారాయణపేట్ 2 జిల్లాలలో ఎంపీడీవోలతో మండల సర్వసభ్యా సమావేశాలు నిర్వహించాలని, ఈ సమావేశాలకు సర్పంచులను పిలువాలని సూచించారు. వారికి అన్ని విషయాలపై అవగాహన కల్పించాలని సూచించారు. ఈ సమావేశాలు నెలరోజుల్లో నిర్వహించాలని ముఖ్యమంత్రి ఆదేశాలు జారీచేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ దీపక్ తివారి, అదనపు కలెక్టరు వెంకటాచారి, పరిగి, తాండూరు ఎంఎల్‌ఏ రామ్మోహన్ రెడ్డి, బుయ్యాని మోహన్‌రెడ్డి, రాష్ట్ర పంచాయతీరాజ్, ఆర్ అండ్ బీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ దాన కిషోర్, ఫైనాన్స్ ప్రిన్సిపల్ సెక్రెటరీ సందీప్ కుమార్ సుల్తానియా, రోడ్లు, భవనాల శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ వికాస్‌రాజ్, హౌసింగ్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ వీపీ గౌతమ్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సెక్రటరీ టీకే శ్రీదేవి, వైద్య, కుటుంబ సంక్షేమశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ క్రిస్టినా జెడ్ చోంగ్తు, ముఖ్యమంత్రి ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీధర్, ఇరిగేషన్ అండ్ కమాండ్ ఏరియా డెవలప్‌మెంట్ సెక్రటరీ శ్రీధర్, టీజీఐఐసీ బీసీ, ఎండీ శశాంక, కడా స్పెషల్ ఆఫీసర్ వెంకట్‌రెడ్డి ఉన్నారు.











