చెన్నై: తమిళనాడు సిఎం నటించిన ఆఖరి చిత్రం ‘జన నాయగన్’. అన్ని అడ్డంకులు దాటుకొని ఈ సినిమా జులై 23న విడుదలై మంచి పాజిటివ్ టాక్‌ని సంపాదించుకుంది. అయితే తాజాగా ఈ చిత్రానికి మరో సమస్య వచ్చి పడింది. చెన్నైలోని కొన్ని థియేటర్లలో ఈ సినిమా షోలను నిలిపివేశారు. సినిమా మధ్యలోనే షోను నిలిపివేయడంతో గందరగోళం నెలకొంది. ఈ చిత్రానికి సెన్సార్‌బోర్డు ‘ఎ’ సర్టిఫికెట్ జారీ చేసిన విషయం తెలిసిందే. కానీ, సినిమాను ప్రదర్శిస్తోన్న కొన్ని థియేటర్లకు మైనర్లు రావడంతో.. షోను ఉన్నట్టుండి నిలిపివేశారు.

ఆదివారం ఉదయం చెన్నైలోని కొన్ని మల్టీప్లెక్స్‌లలో పోలీసులు హఠాత్తుగా తనిఖీలు చేశారు. ‘ఎ’ రేటెడ్ సినిమాలకు మైనర్లను తీసుకురావడం నిబంధనలకు విరుద్ధం కావడంతో ప్రదర్శనను నిలిపివేశారు. ఈ క్రమంలో పిల్లలతో వచ్చిన తల్లిదండ్రులను బయటకు పంపించేందుకు దాదాపు గంట సమయం పట్టింది. దీంతో షో ఆలస్యం కావడంతో కొన్ని చోట్ల గందరగోళం నెలకొంది. ఈ ఘటన నేపథ్యంలో సెన్సార్ బోర్డు నిబంధనలను కఠినంగా అమలు చేయడంపై మల్టీప్లెక్స్ యాజమాన్యాలు మరింత దృష్టి పెట్టాయి. మైనర్లతో వచ్చే వారిని లోపలికి అనుమతించబోమని స్పష్టం చేశాయి.