తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలలో దళపతి విజయ్ అనూహ్య విజయాన్ని దక్కించుకున్నారు. రెండేళ్ళ క్రితం తాను పెట్టిన ’తమిళక వెట్రి కళగం’ (టివికె) పార్టీని ఒంటి చేతితో గెలిపించి, తన సత్తాను చాటుకున్నారు. ఇక విజయ్ పార్టీ ఊహించని విజయాన్ని అందుకోవడంతో తెలుగు, తమిళ సినిమా రంగాలకు చెందిన ప్రముఖులు అతన్ని అభినందనలతో ముంచెత్తారు.

తమిళ స్టార్స్ కమల్‌హాసన్, సూర్య, విక్రమ్, శివకార్తికేయన్, వరలక్ష్మీ శరత్‌కుమార్, జివి ప్రకాష్ కుమార్, మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ మహేష్ బాబు, నాని, రవితేజ, శర్వానంద్, విజయ్ దేవరకొండ, నిఖిల్, సాయి దుర్గాతేజ్, రామ్ పోతినేని, సందీప్ కిషన్, మంచు మనోజ్, డా.రాజశేఖర్, అనిల్ రావిపూడి తదితరులు విజయ్‌ను ఎక్స్ వేదికగా అభినందించారు.

“మీ తొలి ఎన్నికల్లో సాధించిన ఈ అద్భుతమైన, సముచితమైన విజయానికి హృదయపూర్వక అభినందనలు. ఇలానే నిరంతరం ప్రేరణనిస్తూ, దృఢమైన సంకల్పంతో నాయకత్వం వహిస్తూ, ప్రజలకు సేవ చేయాలని కోరుకుంటున్నాను. తమిళనాడు రాష్ట్రం, అక్కడి ప్రజలకు మీరు అందించే ప్రజాసేవలో విజయవంతం కావాలని నా శుభాకాంక్షలు” అంటూ చిరంజీవి ట్వీట్ చేశారు. టాలీవుడ్ స్టార్ హీరో మహేశ్ బాబు తన ప్రియమైన స్నేహితుడైన విజయ్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు. “సరికొత్త బెంచ్ మార్క్‌ను సెట్ చేసి.. అద్భుతమైన విక్టరీని అందుకున్న విజయ్‌కు హృదయపూర్వక శుభాకాంక్షలు. ప్రజలు మీపైన పెట్టుకున్న అపారమైన విశ్వాసం ఈ రోజు ప్రతిబింబిస్తోంది. ఈ సక్సెస్ తమిళనాడుకు అర్థవంతమైన పురోగతిని అందిస్తుందని ఖచ్చితంగా నమ్ముతున్నాను”అని ట్వీట్ చేశారు.