పోరాడి సాధించుకున్న తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేరాలంటే ఆర్థికంగా బలపడాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం చేపడతున్న చర్యలు ఫలితాలిస్తున్నాయి. ఆర్థికంగా స్వాలంబన చేకూరాలంటే రాష్ట్రంలో భారీగా పెట్టుబడులు ఆకర్షించి పరిశ్రమలు తెచ్చేందుకు కంకణం కట్టుకున్న ప్రభుత్వం ఆ దిశగా విజయవంతమయినట్టు గణాంకాలు నిరూపిస్తున్నాయి. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడంతోపాటు ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేస్తున్న ప్రభుత్వం అదే సమయంలో తెలంగాణ భవిష్యత్ లక్ష్యాలను నిర్దేశించుకుంది. ‘తెలంగాణ రైజింగ్-2047’ లక్ష్యంగా దేశానికి స్వాతంత్య్రం వచ్చి వందేళ్లు పూర్తవుతున్న శుభ సందర్భంగా 2047 నాటికి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను మూడు ట్రిలియన్ డాలర్లకు చేర్చేలా దశా దిశ నిర్దేశించుకొని దేశానికి ఆదర్శంగా నిలిచింది. రాష్ట్రంలో పెట్టుబడుల కోసం దావోస్‌తో పాటు ఇతర వేదికలపై ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందాలు కార్యరూపం దాలుస్తున్నాయి. ప్రపంచంలో ఏ ప్రాంతమైనా ప్రగతిపథంలో సాగాలంటే పెట్టుబడులు ఆకర్షించాలి.

భారీ పెట్టుబడులను ఆకర్షించాలని కంకణం కట్టుకున్న తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని వనరులను సద్వినియోగం చేసుకోవడంతోపాటు పెట్టుబడుదారులకు రాష్ట్రంలో అనుకూల వాతావరణం కల్పించడంతో ఐటి రంగానికి తెలంగాణ కేరాఫ్‌గా మారింది. ప్రభుత్వం ప్రకటనలకే పరిమితం కాకుండా ఆచరణలో తీసుకుంటున్న చర్యలతో రాష్ట్రం పెట్టుబడిదారులకు గొప్ప వరంగా మారింది. ‘తెలంగాణ రైజింగ్-2047’కు అనుగుణంగా ప్రభుత్వం వందేళ్లకు అవసరమైన ప్రణాళికలు రూపొందిస్తుండడంతో రాష్ట్రం భారీ పెట్టుబడులకు సోపానంగా మారుతోంది. రేవంత్‌రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక ఆయన మార్గదర్శకంలో ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి డి. శ్రీధర్ బాబు నేతృత్వంలో తెలంగాణ బృందం చేసిన విశేష కృషితో దావోస్ వేదికగా జరిగిన 2024, 2025, 2026 వాణిజ్య సమావేశాల్లో, 2025 డిసెంబర్‌లో హైదరాబాద్‌లో జరిగిన తెలంగాణ గ్లోబల్ సమిట్‌లో కూడా రాష్ట్రానికి భారీగా పెట్టుబడులొచ్చాయి.

రాష్ట్రంలో పెట్టుబడులపై పరిశ్రమల శాఖ ప్రభుత్వానికి ఇచ్చిన నివేదిక ఎంతో ఆశాజనకంగా ఉంది. దావోస్ వేదికగా ప్రపంచ ఆర్థిక సదస్సులో 2024, 2025 సంవతర్సాల్లో 42 కంపెనీలతో రూ. 2,19,182 కోట్ల విలువైన ఒప్పందాలు కుదుర్చుకోగా వాటిలో రూ. 85,200 కోట్లు అంటే 39 శాతం పెట్టుబడులు కార్యరూపం దాల్చడం ప్రభుత్వం చేస్తున్న కృషికి నిదర్శంగా నిలిచాయి. 2024లో ఎంఒయు కుదుర్చుకున్న 10 కంపెనీలు, 2025లో ఒప్పందం కుదుర్చుకున్న 10 కంపెనీలు రాష్ట్రంలో పనులు ప్రారంభించాయి. ఇందులో ప్రధానంగా ఐటి, పరిశ్రమల రంగాలకు చెందిన గ్లోబల్ కేపబులిటీ సెంటర్లు, డేటా సెంటర్ ప్రాజెక్టులున్నాయి. వరల్డ్ ఎకనామిక్ ఫోరం 2024, 2025 లో వచ్చిన పెట్టుబడులకు సంబంధించిన వాటా 34 శాతం ఉండగా, వీటిలో ప్రధానంగా పంప్ స్టోరేజ్ ప్రాజెక్టులు, పునరుత్పాదక ఇంధన ప్లాట్లు ఉన్నాయి.

తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ 2025లో కుదిరిన మొత్తం 75 ఒప్పందాలపై ప్రభుత్వం వేగవంతంగా చర్యలు తీసుకోవడంతో 14 ఒప్పందాలు అమల్లోకి వచ్చాయి. రూ. 30 వేల కోట్ల పెట్టుబడులు కార్యరూపం దాల్చడానికి అవసరమైన 255పైగా ఎకరాల భూమిని ప్రభుత్వం కంపెనీలకు కేటాయించింది. దావోస్ 2026 సమిట్‌లో కుదిరిన ఒప్పందాలు కూడా వాస్తవ రూపం దాలుస్తున్నాయి. ఈ సమిట్‌లో కుదిరిన 75 ఒప్పందాల్లో 16 ప్రాజెక్టులు భారత్ ఫ్యూచర్ సిటీలో పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నాయి.ఎంటర్‌టైన్‌మెంట్ జోన్, హెల్త్, మెడికల్ టూరిజం జోన్, ఎఐ సిటి, ఎడ్యుకేషన్ జోన్, ఇవి తయారీ జోన్‌లు ఈ ప్రాజెక్టులో ఉన్నాయి. 2024 నుండి 2026 వరకు తెలంగాణకు సుమారు రూ. 8 లక్షల కోట్ల పెట్టుబడుల ఎంఒయు లొచ్చాయి. వీటిలో వాటిలో దాదాపు 35 నుండి 40 శాతం పనులు ప్రారంభమయ్యాయి. తెలంగాణలో పెట్టుబడులను ప్రోత్సాహించేందుకు ప్రభుత్వం పారిశ్రామిక విధానం రూపొందించడంతో కంపెనీలకు రాష్ట్రం అనుకూలంగా మారింది. పరిశ్రమల ఏర్పాటుకు వచ్చే దరఖాస్తులపై కాలయాపన చేయకుండా సింగిల్ విండో విధానంలో 15 రోజుల్లో అనుమతులు మంజూరు చేస్తోంది.

రాష్ట్రంలో పరిశ్రమల పెట్టుబడులతో ఆర్థికాభివృద్ధే కాకుండా, ఉపాధి అవకాశాలతోపాటు రియల్ ఎస్టేట్ కూడా వేగంగా పుంజుకుంటోంది. యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెంచాలనే దృఢ సంకల్పంతో ప్రభుత్వం పరిశ్రమల ఏర్పాటుకు సానుకూల చర్యలు చేపట్టింది. సాంకేతిక పెట్టుబడులకు కీలకంగా మారిన గ్రేటర్ హైదరాబాద్‌కు ప్రముఖ సాఫ్ట్‌వేర్ కంపెనీలు క్యూ కట్టాయి. బెంగళూరు, పుణె, గుర్‌గావ్ నగరాలను వెనక్కునెట్టి హైదరాబాద్ ‘గ్లోబల్ ఐటీ హబ్’గా రూపొంది ప్రముఖ టెక్ సంస్థలకు వేదికైంది. రాష్ట్రానికి వస్తున్న పెట్టుబడుల్లో సాఫ్ట్‌వేర్ రంగానిదే కీలకం కావడంతో ప్రభుత్వం దీనికి అనుగుణంగా పలు విప్లవాత్మక నిర్ణయాలతో ముందుకొస్తుండడంతో యవతకు అవకాశాలు మెరుగయ్యాయి. నగరంలో 1500కుపైగా ఐటి కంపెనీలుండగా, ఇక్కడ 10 లక్షల మందికిపైగా ఉపాధి పొందుతున్నారు. ప్రపంచంలో అత్యుత్తమ 10 ఐటి కంపెనీల్లో 7 గ్రేటర్ నగరంలో ఉన్నాయి.

మైక్రోసాఫ్ట్, అమెజాన్, మెటా, గూగుల్, సేల్స్ ఫోర్సు కంపెనీలకు నగరంలో కార్యాలయాలున్నాయి. ప్రపంచంలో మెరుగైన నగరాలతో పోటీపడేలా హైదరాబాద్ శివార్లలో ఫ్యూచర్ సిటీ, యంగ్ ఇండియా యూనివర్సిటీ ఏర్పాటుతో తెలంగాణలో పెట్టుబడులకు అదనపు బలం చేకూరింది. బలమైన ఆర్థిక పునాదులుంటేనే రాష్ట్రం అభివృ ద్ధిలో కొనసాగుతుందనే దూరదృష్టితో చర్యలు తీసుకున్న ప్రభుత్వం అందులో భాగంగా పెట్టుబడులను ఆకర్షించడానికి ఏర్పాటు చేసిన ఫ్యూచర్ సిటీ కంపెనీలకు వరంగా మారింది. తెలంగాణతో ఒప్పందాలు కుదుర్చుకున్న పలు కంపెనీలు ఫ్యూచర్ సిటిలో ప్రభుత్వం కల్పించిన మౌలిక సదుపాయాలకు ఆకర్షితులై పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చాయి. సకల సౌకర్యాలతో 30 వేల ఎకరాల్లో ఫ్యూచర్ సిటీని ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేస్తున్నారు. హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్‌లకు అదనంగా నాలుగో నగరంగా ‘ఫ్యూచర్ సిటీ’ రూపొందుతోంది.

ఇక్కడ ఐటితో పాటు ఇతర రంగాలకు కూడా ప్రాధాన్యతిస్తున్నారు. యాపిల్ ఫోన్ విడిభాగాల పరిశ్రమ, ఎలక్ట్రిక్ ఇవి బస్సుల తయారీ యూనిట్, టెక్స్‌టైల్ పరిశ్రమలు, ప్రతిష్టాత్మకమైన విద్యా సంస్థలు, రెస్టారెంట్లు, రేస్ క్లబ్, గోల్ఫ్ క్లబ్, ట్రేడ్ సెంటర్లు రానున్నాయి. కాలుష్య రహితంగా అభివృద్ధి చేస్తున్న ఈ ఫోర్త్ సిటీలో పరిశోధనలు చేసే సంస్థలకు, ముడి సరుకు తెచ్చి మందులను తయారు చేసే ఫార్మా కంపెనీలకే భూములను కేటాయిస్తారు. శంషాబాద్ విమానాశ్రయం సమీపంలో ఉండడంతోపాటు రహదారుల విస్తరణ, మెట్రో పొడగింపుతో నాలుగో నగరానికి రవాణా సదుపాయాలు పుష్కలంగా ఉన్నాయి. అంతర్జాతీయ ప్రమాణాలతో ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న ఎఐ యూనివర్సిటీ పలువురిని ఆకర్షిస్తోంది.

యువతను ఎఐ నిపుణులుగా తీర్చిదిద్దాలనే గొప్ప లక్ష్యంతో ‘తెలంగాణ డేటా ఎక్స్‌ఛేంజ్’ (టిజిడెక్స్)ను ఏర్పాటు చేసిన తొలి రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. కాలానుగుణంగా ప్రభుత్వం చేపడుతున్న చర్యలు రాష్ట్రంలో పెట్టుబడులకు కీలకంగా మారాయి. పెట్టుబడులను ఆకర్షించడంలో తెలంగాణ ప్రభుత్వం ప్రణాళికాబద్ధమైన విధానాలతో వేగవంతమైన నిర్ణయాలు, పారదర్శక పరిపాలనతో గణనీయమైన పురోగతి సాధిస్తోంది. పలు వేదికలపై కుదిరిన ఒప్పందాలు కార్యరూపం దాల్చడం రాష్ట్రంపై పెట్టుబడిదారుల విశ్వాసాన్ని ప్రతిబింబిస్తోంది. ఉపాధి అవకాశాలు, సదుపాయాల అభివృద్ధి, సాంకేతిక రంగంలో పురోగతి రాష్ట్రాన్ని సమగ్రాభివృద్ధి దిశగా తీసుకెళ్తున్నాయి. ఇదే నిబద్ధతతో కొనసాగితే ‘తెలంగాణ రైజింగ్- 2047’ కేవలం విజన్‌గానే కాకుండా వాస్తవాల దృక్పథంతో తెలంగాణ ఆదర్శంగా నిలుస్తుంది.

- ఐవి మురళీ కృష్ణశర్మ