
న్యూఢిల్లీ: ‘వందేమాతరం’ బిల్లుకు లోక్‌సభ ఆమోద ముద్ర వేసింది. విపక్షాల ఆందోళనల మధ్యే మూజువాణి ఓటుతో బిల్లు ఆమోదం పొందింది. ఈ బిల్లును బుధవారం రాజ్యసభ ఆమోదించిన విషయం తెలిసిందే. వందేమాతర గేయాన్ని అవమానించినా, ఆలపిస్తుండగా ఆటంకం కలిగించినా నేరంగా పరిగణించేందుకే కేంద్రం ఈ బిల్లును తీసుకొచ్చింది.
వందేమాతరం బిల్లులో భాగంగా ది ప్రివెన్షన్ ఆఫ్ ఇన్సల్ట్స్ టు నేషనల్ ఆనర్-1971లో సవరణలు చేసింది. రాష్ట్రపతి ఆమోదం పొందిన తర్వాత ఇది చట్టంగా మారనుంది. ప్రస్తుతం జాతీయ గీతమైన జనగణమనకు ఉన్న చట్టపరమైన రక్షణను వందేమాతరానికీ వర్తింపజేయడమే ఈ బిల్లు ప్రధాన ఉద్దేశం. మరోవైపు ఈ బిల్లుపై ఓటింగ్ ముగిసిన తర్వాత స్పీకర్ ఓం బిర్లా సభను రేపటికి వాయిదా వేశారు.








