
న్యూఢిల్లీ: వందేమాతరం గేయంలోని రెండు చరణాలను మాత్రమే ఆలపించాలని కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయాన్ని ఖండిస్తూ భారతీయ జనతా పార్టీ (బీజేపీ) శనివారం ఒక తీర్మానం చేసింది. రాజకీయ ప్రయోజనాల కోసమో, బుజ్జగింపు రాజకీయాల కోసమో జాతీయగీతం గౌరవంలో ఎలాంటి రాజీని అంగీకరించమని స్పష్టం చేసింది. దేశంలోని రాజ్యాంగ సంస్థలు, చట్టాలను కాంగ్రెస్ తీర్మానం అధిగమించలేదని పేర్కొంది. దేశం నలుమూలలా వందేమాతరం ప్రాధాన్యతను చాటిచెప్పేలా ప్రచార కార్యక్రమాన్ని చేపడతామని తెలిపింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ అధ్యక్షతన జరిగిన కొత్త కార్యవర్గ సమావేశంలో ఈ తీర్మానాన్ని ఆమోదించారు. అనంతరం సమావేశం వివరాలను ఆయన సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో పంచుకున్నారు.
వందేమాతరంపై 1937లో చేసిన తీర్మానాన్నే అనుసరించాలని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఆగస్టు 19న నిర్ణయించింది. ఇకపై పార్టీ కార్యక్రమాల్లో వందేమాతరంలోని తొలి రెండు చరణాలను మాత్రమే ఆలపించాలని నిర్ణయం తీసుకుంది. దీనిపై బీజేపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. వందేమాతరం గౌరవం, వారసత్వాన్ని రాజకీయ సౌలభ్యం కోసమో, బుజ్జగింపు కోసమో రాజీ పడే ఎలాంటి ప్రయత్నాన్ని అయినా బీజేపీ వ్యతిరేకిస్తుందని నబిన్ తెలిపారు. 1937లో జరిగిన ‘రాజకీయ రాజీ’ని 1950లో ఏర్పడిన రాజ్యాంగ వ్యవస్థ, 2026లో పార్లమెంటు ఆమోదించిన చట్టాల కంటే ఉన్నతంగా పరిగణించలేమని స్పష్టం చేశారు.
పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో భాగంగా జులై 20న ‘జాతీయ గౌరవ అవమాన నిరోధక చట్టం-2026’ను ఉభయసభలు ఆమోదించాయి. సవరించిన చట్టం ప్రకారం వందేమాతరం ఆలాపనను ఉద్దేశపూర్వకంగా అడ్డుకున్నా, అంతరాయం కలిగించినా నేరంగా పరిగణిస్తారు. దీనికి గరిష్ఠంగా మూడేళ్ల వరకూ జైలు శిక్ష, జరిమానా లేదా రెండూ విధించే అవకాశం ఉంది.
పూర్ణ వందేమాతరం గౌరవం, ప్రతిష్ట, వారసత్వం, జాతీయ స్వభావాన్ని బీజేపీ కాపాడుతుందని నితిన్ నబిన్ తెలిపారు. వందేమాతరాన్ని మహాత్మాగాంధీ సామ్రాజ్యవాద వ్యతిరేక నినాదంగా, అత్యంత స్వచ్ఛమైన జాతీయ భావనకు ప్రతీకగా అభివర్ణించిన వ్యాఖ్యలను కూడా ప్రజల్లోకి తీసుకు వెళ్లాలని తమ పార్టీ నిర్ణయించినట్టు చెప్పారు. యువతలో అవగాహన కల్పించేందుకు ప్రచారం నిర్వహించాలని, ఆరు చరణాలతో కూడిన పూర్తి జాతీయ గీతం, దాని చరిత్రను మరుగున పడకుండా చూడాలని, వందేమాతరంతో ముడిపడిన స్వాతంత్య్ర పోరాట జ్ఞాపకాలను భవిష్యత్ తరాలు అర్ధం చేసుకునేలా చేయాలని అన్నారు. ‘ఇది కేవలం ఒక రాజకీయ పార్టీకి సంబంధించిన విషయం కాదు. ఇది దేశ గౌరవానికి, స్వాతంత్య్ర కోసం త్యాగాలు చేసిన అనేక మంది దేశభక్తుల వారసత్వానికి సంబంధించిన విషయం’ అని అన్నారు. 1947లో స్వాతంత్య్ర పిలుపుగా మార్మోగిన వందేమాతరం 2024 నాటికి అభివృద్ధి చెందిన భారత్ నిర్మాణ లక్ష్యంలోనూ కొనసాగుతుందని నబీన్ చెప్పారు.











