
మంగళూరు: కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన పంద్రాగస్టు వేడుకల్లో ‘వందేమాతరం’ ఆలాపనకు సంబంధించిన వివాదంలో ఆ పార్టీ ఎంపీ సోనియాగాంధీపై బీజేపీ నేతలు పోలీసులకు ఆదివారం ఫిర్యాదు చేశారు. మంగళూరులోని ఉర్వా పోలీస్ స్టేషన్‌లో ఈ ఫిర్యాదు చేసినట్టు అధికారులు తెలిపారు. వందేమాతరం ఆలాపన విషయంలో సోనియాగాంధీ వ్యవహరించిన తీరు సరైనది కాదని, జాతీయ గేయంతో ముడిపడిన ప్రజల భావోద్వేగాలు దెబ్బతిన్నాయని ఆ ఫిర్యాదులో బీజేపీ నేతలు పేర్కొన్నారు.
సోనియాగాంధీపై చర్య తీసుకోవాలని కోరారు. అయితే పోలీసులు ఇంతవరకూ ఎఫ్‌ఐఆర్ నమోదు చేయలేదు. బీఎన్‌ఎస్‌ఎస్‌లోని నిబంధనల కింద పోలీసులు సొంతంగా ఎఫ్‌ఐఆర్ నమోదు చేయవచ్చని బీజేపీ నేతలు చెప్పారు.అయితే ఎఫ్‌ఐఆర్ నమోదు చేసే ముందు న్యాయనిపుణుల సలహా కోరినట్టు పోలీసులు తెలిపారు. కాంగ్రెస్ కార్యాలయంలో స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా వందేమాతర గేయం అలపిస్తుండగా సోనియాగాంధీ సైగలతో అడ్డుకున్నట్టు బీజేపీ ఆరోపిస్తోంది. అయితే ఆ ఆరోపణలను కాంగ్రెస్ ఖండించింది. ఎక్కువ సేపు నిల్చొని ఉన్న పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకు కుర్చీ వేయాల్సిందిగా సోనియా సైగ చేశారని, గేయాన్ని ఆపాలని కాదని స్పష్టం చేసింది.











