
ఇంటికి రాలేక.. శిబిరాల్లో ఉండలేక నేపాలీల యాతన తాత్కాలిక
శిబిరాల్లో సౌకర్యాల లేమి మళ్లీ వరద హెచ్చరికలతో నిత్యావసరాలతో
ఎత్తైన ప్రాంతాలకు తరలుతున్న ప్రజలు 788కి చేరిన మృతుల సంఖ్య
గుర్తుపట్టలేని స్థితిలో మృతదేహాలు డిఎన్ఏ నమూనాలు సేకరించి సామూహిక ఖననాలు ఇప్పటికీ
జాడలేని 300 మందికిపైగా భారతీయులు జలవిద్యుత్ ప్రాజెక్టుల్లో చిక్కుకున్న 500 మంది కార్మికులు
రక్షించేందుకు నిపుణుల సాయంతో చర్యలు 3 రోజుల తరువాత శిథిలాల్లోంచి బయటపడ్డ ఆరేళ్ల బాలిక
ఖాట్మండూ: నేపాల్‌లో ఆకస్మిక వరదల ప్రభా వం ఇంకా కొనసాగుతోంది. ఈ విపత్తులో మృతుల సంఖ్య ఆదివారంనాడు 788కి చేరిం ది. మరో 2,502 మంది గల్లంతయ్యారు. వీరి లో 320 మంది విదేశీయులు ఉన్నారు. భోటెకోషి నదిలో నీటిమట్టం మరోసారి పెరిగినట్లు నేపాల్ విపత్తుల విభాగం హెచ్చరించింది. ‘వరద ప్రభావిత భోటెకోషి నదిలో నీటిమట్టం కొంత మేర పెరిగింది. సంబంధిత అధికారు లు, ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవా లి‘ అని పేర్కొంది. మరింత సమాచారం అంది న తర్వాత పరిస్థితిపై తాజా వివరాలు వెల్లడిస్తామని తెలిపింది. మరోవైపు నేపాల్ వరదల నేపథ్యంలో 275 మందికిపైగా భారతీయులు, భారత సంతతికి చెందిన 128 మంది గల్లంతైనట్లు లేదా వారితో సంబంధాలు తెగిపోయినట్లు భారత విదేశాంగ శాఖ శనివారం వెల్లడించింది. మరో 108 మంది భారతీయులను రక్షించినట్లు తెలిపింది.
గల్లంతైన వారిలో మూడు వరద ప్రభావిత జిల్లాలకు చెందిన 238 మంది విద్యార్థులు, 18 మంది ఉపాధ్యాయులు ఉన్నారు. వరదల అనంతరం మృతదేహాల వెలికితీత కొనసాగుతోంది. భారీ వర్షా లు, నదుల్లో పెరుగుతున్న నీటిమట్టాల మధ్య సహాయక, గాలింపు చర్యలు కొనసాగుతున్నా యి. ఆదివారం సాయంత్రం వరకు చిత్వాన్ జిల్లాలోనే 264 మృతదేహాలు లభించాయి. నావల్పరాసి ఈస్ట్‌లో 194, నావల్పరాసి వెస్ట్‌లో 100 మృతదేహాలను గుర్తించారు. గోర్ఖా, ధాదింగ్, నువాకోట్, తనహు, రసువా జిల్లాల్లోనూ మరిన్ని మృతదేహాలు వెలికితీశారు. గల్లంతైన తమ బంధువుల కోసం ఆసుపత్రుల వద్ద భారీ సంఖ్యలో ప్రజలు గుమిగూడుతున్నారు. మృతదేహాలను గుర్తించేందుకు ఆసుపత్రుల గోడలపై చిత్రాలను ప్రదర్శిస్తున్నారు.అయితే ఇప్పటివరకు లభించిన మృతదేహాల్లో కేవలం 17 మందిని మాత్రమే గుర్తించినట్లు పోలీసులు తెలిపారు.
చాలా మృతదేహాలు ఎక్కువకాలం నీటిలో ఉండటంతో తీవ్రంగా దెబ్బతినడం, శరీర భాగాలు విడిపోవడం వల్ల గుర్తింపు కష్టంగా మారిందని భాగమతి ప్రావిన్స్ పోలీస్ ప్రతినిధి రాజేంద్ర ప్రసాద్ ధమాలా తెలిపారు. ఇప్పటివరకు 96 మృతదేహాలకు చట్టపరమైన ప్రక్రియలు పూర్తిచేసి అంత్యక్రియలు నిర్వహించినట్లు ఆయన చెప్పారు. అంత్యక్రియలకు ముందు ప్రతి మృతదేహం నుంచి డీఎన్ఏ నమూనాలను సేకరించి నిర్దేశిత ప్రదేశాల్లో భద్రపరిచినట్లు తెలిపారు. గుర్తించిన మృతదేహాలను ధ్రువీకరణ ప్రక్రియ పూర్తయ్యాక కుటుంబ సభ్యులకు అప్పగిస్తున్నట్లు వివరించారు. భవిష్యత్తులో కుటుంబ సభ్యులు తమ రికార్డులతో సరిపోల్చుకునే అవకాశం ఉంటుందని చెప్పారు. అవసరమైన మతపరమైన కార్యక్రమాల కోసం మృతదేహాలను వెలికితీసే అవకాశం కూడా ఉంటుందని తెలిపారు. డీఎన్ఏ విశ్లేషణలో నైపుణ్యం కలిగిన 18 మంది భారత ఫోరెన్సిక్ నిపుణుల బృందం నేపాల్‌కు చేరుకుంది.
చైనా వైపూ భారీ నష్టం
ఈ విపత్తు చైనా వైపున కూడా తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. అక్కడ 16 మంది మృతి చెందగా, 546 మంది గల్లంతయ్యారు. గల్లంతైన వారిలో 23 దేశాలకు చెందిన 261 మంది విదేశీయులు ఉన్నారు. వారిలో 49 మంది భారతీయులు ఉన్నారు. చైనా వైపు ఒక సరస్సు ఏర్పడటం నేపాల్‌లో మరోసారి వరదలు సంభవిస్తాయనే ఆందోళనకు దారితీసింది. అయితే శనివారం నాటికి ఆ సరస్సు పరిమాణం తగ్గుముఖం పట్టడంతో ముప్పు కొంత తగ్గినట్లు చైనా మీడియా తెలిపింది. అయితే ఆదివారం మరో కొత్త ఆందోళన తెరపైకి వచ్చింది. సహజ ఆనకట్ట సమీపంలో కొండచరియలు విరిగిపడటంతో మరో ’డ్యామ్ లేక్’ ఏర్పడినట్లు సమాచారం రావడంతో సహాయక సిబ్బందిని ఆ ప్రాంతం నుంచి తరలించారు.
ఆ 500మంది కార్మికుల పరిస్థితి ఏంటీ..?
వరద ప్రభావిత ప్రాంతాల్లోని కనీసం తొమ్మిది జలవిద్యుత్ ప్రాజెక్టుల వద్ద 500 మంది కార్మికులు చిక్కుకుపోయినట్లు భావిస్తున్నారు. ముఖ్యంగా సరిహద్దు జిల్లాలైన రసువా, నువాకోట్‌లో పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. చిక్కుకుపోయిన కార్మికులను రక్షించేందుకు భారత్ నుంచి 11 మంది సభ్యుల బృందం సహాయక చర్యల్లో పాల్గొంటోంది. త్రిశూలీ జలవిద్యుత్ ప్రాజెక్టు వద్ద నేపాల్ భద్రతా సిబ్బంది, భారత సొరంగ నిపుణుల సహకారంతో సొరంగ ప్రవేశద్వారాన్ని గుర్తించి కార్మికులను బయటకు తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు కొనసాగించారు.











