
హాంగ్‌జౌ: చైనా వేదికగా జరుగుతన్న ఐఎస్‌ఎస్‌ఎఫ్ వరల్డ్ కప్ షూటింగ్‌లో భారత్ స్వర్ణం సాధించి సత్తా చాటింది. మహిళల 25 మీటర్ల పిస్టల్ విభాగంలో హైదరాబాద్‌కు చెందిన యువ సంచలనం ఇషా సింగ్ పసిడి పతకం సాధించింది. భారత్‌కే చెందిన మరో స్టార్ షూటర్ మనుబాకర్ ఇదే విభాగంలో కాంస్య పతకం సొంతం చేసుకుంది. సోమవారం జరిగిన ఫైనల్లో ఇషా అసాధారణ ఆటతో అలరించింది. క్వాలిఫికేషన్స్‌లో అంతంత మాత్రంగానే రాణించిన ఇషా కీలకమైన ఫైనల్లో మాత్రం చెలరేగి పోయింది.
అత్యంత నిలకడైన ఆటను కనబరుస్తూ ముందుకు సాగింది. ఇదే క్రమంలో రికార్డు స్థాయిలో 40 హిట్స్‌తో ప్రథమ స్థానంలో నిలిచి పసిడి పతకాన్ని కైవసం చేసుకుంది. 21 ఏళ్ల ఇషా అంతర్జాతీయ షూటింగ్‌లో అద్భుత ఆటతో అదరగొడుతోంది. పలు అంతర్జాతీయ పోటీల్లో పతకాలు సాధిస్తూ దేశ,రాష్ట్ర ఖ్యాతిని ఇనుమడింప చేస్తోంది. ఇదిలావుంటే భారత స్టార్ షూటర్ మనుబాకర్ 28 హిట్స్‌తో కాంస్యం దక్కించుకుంది. కాగా, చైనాకు చెందిన ఝాంగ్ 37 హిట్స్‌తో రజతం సాధించింది.











