వర్షాలు వస్తుండడంతో కొల్లూరులో గత బిఆర్‌ఎస్ ప్రభుత్వం నిర్మించిన నాసిరకం డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కురుస్తున్నాయని, ఆ ఇళ్లను మర మ్మతులు చేయించి ఆదుకోవాలని లబ్ధిదారులు సిఎం ప్రజావాణిలో ఇంచార్జ్ డాక్టర్ జి.చిన్నారెడ్డితో మొరపెట్టు కున్నారు. శుక్రవారం మహాత్మా జ్యోతిబాఫూలే ప్రజాభవన్‌లో నిర్వహించిన 243వ సిఎం ప్రజావాణి కార్యక్రమానికి కొల్లూరు డబుల్ బెడ్ రూమ్ లబ్ధిదారులు తరలివచ్చారు. చిన్నపాటి వర్షాలకే కొల్లూరు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కురుస్తున్నాయని, ఇళ్లన్నీ జలమయమై ఆ ఇళ్లల్లో నివాసం ఉండలేకపోతున్నామని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేశారు. కొల్లూరు డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల ప్రాంగణంలో మెయింటినెన్స్ కూడా సరిగా లేదని రవాణా సౌకర్యం కూడా లేదని లబ్ధిదారులు చిన్నారెడ్డి దృష్టికి తీసుకువచ్చారు. బిఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో ఇళ్ల నిర్మాణాలు నాసిరకంగా జర గడం వల్ల ఈ సమస్య ఉత్పన్నమవుతోందని వారన్నారు.

వెంటనే స్పందించిన చిన్నారెడ్డి హౌసింగ్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ గౌతమ్‌తో ఫోన్‌లో మాట్లాడి ఈ సమస్యలను వివరించి తక్షణమే చర్యలు తీసుకోవాలని సూచించారు. అధికారులను కొల్లూరు డబుల్ బెడ్‌రూమ్ ప్రాంగణానికి పంపించి ఇళ్లను మరమ్మత్తులు చేయించే ప్రక్రియను వెంటనే ప్రారంభిస్తామని హౌసింగ్ ఎండి గౌతమ్ తెలిపారు. కాగా 243వ సిఎం ప్రజావాణి కార్యక్రమంలో మొత్తం 288 ధరఖాస్తులు అందాయి. పంచాయతీరాజ్ - గ్రామీణ అభివృద్ధి శాఖకు 136, రెవెన్యూ శాఖకు 40, మున్సిపల్ శాఖకు 21, ప్రవాసి ప్రజావాణికి 02, ఇతర శాఖలకు 89 దరఖాస్తులు అందాయి. సిఎం ప్రజావాణి ఇంచార్జ్ డాక్టర్ జి చిన్నారెడ్డి, స్టేట్ నోడల్ అధికారి కె. విద్యా సాగర్ దరఖాస్తులు స్వీకరించి ఎండార్స్మెంట్ చేసి సంబంధిత అధికారులకు ఫోన్ చేసి సమస్యలను పరిష్కరించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కలెక్టర్ వెంకటేశ్వర్లు, ఎసిపి ఉమేందర్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.