
ఇండియన్ ప్రీమియర్ లీగ్ అంటేనే ఫ్యాన్స్‌లో ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. స్టేడియంలో ఈ మ్యాచ్‌లు చూసేందుకు అభిమానులు క్యూలు కడతారు. లేని పక్షంలో టివి, మొబైల్ ఇలా తమకు అందుబాటులో ఉన్న పరికరంలో ఈ మ్యాచ్‌లు వీక్షిస్తారు. అందుకే ఐపిఎల్‌కి ఎక్కడా లేనన్ని వ్యూస్ వస్తాయి. ఇక ప్రస్తుతం జరుగుతున్న ఐపిఎల్‌కి కూడా ఏ మాత్రం ఆదరణ తగ్గలేదు. మొన్నటి వరకూ ఎన్నికల హడావుడి ఉన్నా.. దాన్ని తట్టుకొని మరీ అద్భుత గణాంకాలను నమోదు చేసింది. ఐపిఎల్ చరిత్రలోనే అత్యధిక వ్యూయర్‌షిప్ ఈ సీజన్‌లో రావడం గమనార్హం. టివి, డిజిటల్ వ్యూస్‌లో భారీ పెరుగుదల కనిపించింది. రెండు ఫ్లాట్‌ఫామ్‌ల్లో 1.1 బిలియన్ వ్యూస్ వచ్చినట్లు జియో హాట్‌స్టార్ వెల్లడించింది. టివి వ్యూయర్‌షిప్ 50 కోట్ల మార్క్‌ను తాకింది. ఇటు డిజిటల్ విభాగంలో 15 శాతం వృద్ధి నమోదు చేసినట్లు జియో వెల్లడించింది. ఇందులో మ్యాచ్‌లను వీక్షించిన సమయం 7 శాతం పెరిగిందని తెలిపింది. స్థానిక భాషల్లోనూ 42 శాతం పెరగడం గమనార్హం. ప్లేఆఫ్స్ రేసు రసవత్తరంగా మారడంతో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం లేకపోలేదు.













