
గాలె: భారత్, శ్రీలంక మధ్య శనివారం తొలి టెస్ట్ మ్యాచ్ ప్రారంభం అయిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో భారత యువ సంచలనం యశస్వి జైస్వాల్ అరుదైన ఘనత సాధించాడు. శ్రీలంకతో జరుగుతున్న టెస్ట్‌లో జైస్వాల్ 32 పరుగుల వద్ద రనౌట్‌గా వెనుదిరిగాడు. అయితే జైస్వాల్‌కి ఇది అతడి కెరీర్‌లో 30వ టెస్ట్ మ్యాచ్. మొత్తం 55 ఇన్నింగ్స్ ఆడాడు. అతడి ఖాతాలో 2,567 పరుగులు ఉన్నాయి. ఈ క్రమంలో టీం ఇండియా క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌తో పాటు మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ సాధించిన అరుదైన రికార్డును జైస్వాల్ సాధించాడు.
కెరీర్‌లో తొలి 30 టెస్టులను భిన్నమైన వేదికల్లో ఆడిన భారత ప్లేయర్లు మొన్నటి వరకూ ఇద్దరే ఉన్నారు. ఇప్పుడు ఈ లిస్టులోకి మూడో ప్లేయర్‌గా జైస్వాల్ చేరాడు. సంజయ్ మంజ్రేకర్ వరుసగా 33 టెస్టులను వేర్వేరు వేదికల్లో ఆడాడు. అయితే అతడి కెరీర్‌లో ఆడింది 37 టెస్టులు మాత్రమే. ఇక సచిన్ 32 టెస్టులను వేర్వేరు వేదికల్లో ఆడగా.. ఇప్పుడు జైస్వాల్ 30 టెస్టులను పూర్తి చేసుకున్నాడు. సచిన్ తన కెరీర్‌లో 200 టెస్టు మ్యాచ్‌లు ఆడారు. ఈ జాబితాలో తొలి స్థానంలో ఉన్న సంజయ్ రికార్డును జైస్వాల్ అధిగమించే అవకాశం ఉంది. ఈ సిరీస్‌లో రెండో టెస్ట్ మ్యాచ్ కొలంబోలో జరుగుతుంది. ఆ తర్వాత న్యూజిలాండ్ సిరీస్ ఉంది. అప్పుడు జైస్వాల్ ఆ రికార్డును బ్రేక్ చేసే అవకాశం ఉంది.








