
కారణాలేమైనా సరే దేశాన్ని నడిపించాల్సిన యువతేజం ఎక్కడ ఏ ఆకాశం కొసన అస్తమించినా అది దేశానికి నష్టం, అరిష్టం అని విజ్ఞులు చెబుతుంటారు. అలాగే విద్యార్థులు నవ సమాజ నిర్మాతలని కవులు కీర్తిస్తుంటారు. ఈ నేపథ్యంలో చదువుల్లో ఉత్తీర్ణులు కాలేక ఓడిపోయామని కుంగుబాటుతో విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటే ఆయా కుటుంబాల్లో రగులుకున్న క్షోభ ఎవరూ ఆర్పలేనిది, తీర్చలేనిది. ప్రవేశ పరీక్షలు (ఎంట్రన్స్ ఎగ్జామ్స్) ఒక ద్వారపాలకుడిలా పనిచేస్తాయి. భారతీయ యువతలో ఎవరికి భద్రమైన, అధికారిక ఉద్యోగాన్ని పొందే అవకాశం దక్కుతుందో నిర్ణయిస్తాయి. అయితే అనేక పరీక్షల్లో ప్రశ్నపత్రాలు వరుసగా లీక్ కావడం వల్ల ప్రతిభను పరీక్షించే వ్యవస్థ విస్తృతమైన అవినీతికూపంగా మారిపోవడం మొత్తం విద్యార్థి లోకాన్ని దారి తెన్నూ లేని చీకటి ప్రపంచం లోకి నెట్టుతోంది. నీట్ పరీక్ష ప్రశ్నావళి లీక్ కావడం, రద్దు చేసి మళ్లీ నిర్వహించడం ఈలోగా దాదాపు 20 మంది విద్యార్థులు మానసికంగా కుంగిపోయి బలవన్మరణాలకు పాల్పడడం దేశాన్ని ప్రస్తుతం తీరని విషాదంలో ముంచెత్తుతోంది.
నీట్ పరీక్షలో ప్రశ్నపత్రాల లీకేజీ వంటి విద్యావ్యవస్థలో అస్తవ్యస్త పరిస్థితులపై కదంతొక్కిన కాక్రోచ్ జనతా పార్టీ చివరకు మోడీ ప్రభుత్వం మెడలువంచి డిమాండ్లను సాధించుకున్న సంఘటన చారిత్రాత్మకం. ఈ డిమాండ్లలో ఆత్మహత్యలకు పాల్పడిన విద్యార్థుల కుటుంబాలకు రూ. కోటి వంతున పరిహారం చెల్లించడానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. ఇటువంటి డిమాండ్లు పరిష్కారం కానున్నాయన్న సంతృప్తి పడితే ఇంకా పట్టిపీడిస్తున్న సమస్యలు పరిష్కారం అయినట్టు కాదు. నీట్ పరీక్ష వంటి ముఖ్యమైన పరీక్షలతో ముడిపడి ఉన్న అనేక సమస్యలు ఇంకా పరిష్కారం కాకుండా మిగిలి ఉన్నాయి. వీటిపై కూడా కాక్రోచ్ జనతాపార్టీ వంటి జెన్‌జెడ్ ఉద్యమాలు దృష్టి కేంద్రీకరించవలసిన అవసరం ఉంది. గత మేనెల మొదటి వారంలో నీట్ పరీక్షకు దాదాపు 20 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. అయితే ఈ పరీక్ష రద్దయిన తరువాత దాదాపు 20 మంది అభ్యర్థులు బలవన్మరణాలకు పాల్పడినట్టు అంచనా. ఈ ఆత్మహత్యలను కేవలం ఒకరి వ్యక్తిగత సమస్య కారణంగా చూపలేం.
వీటి వెనుక సామాజిక, ఆర్థిక పరిస్థితులతోపాటు వ్యవస్థాపక ఒత్తిళ్లు కూడా ప్రధానంగా ప్రభావితం చేస్తున్నాయి. 2014 2024 మధ్యకాలంలో 1.23 లక్షల మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు. చదువుల్లో ఒత్తిడి, కుటుంబ సమస్యలు, మానసిక ఆరోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, వ్యక్తుల మధ్య సంఘర్షణ తదితర కారణాలే విద్యార్థుల ఆత్మహత్యలకు దారి తీశాయని, పార్లమెంట్‌లో కేంద్ర విద్యామంత్రిత్వశాఖ వెల్లడించడం గమనార్హం. దేశం మొత్తం మీద ప్రమాదాల వల్ల మరణాలు, ఆత్మహత్యలు (ఎడిఎస్‌ఐ)పై నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో వెల్లడించిన నివేదిక ప్రకారం ఆత్మహత్యలకు దారి తీసిన పరిస్థితుల్లో ‘పరీక్షల్లో విఫలమవ్వడం అనే అంశాన్ని ఇతర కారణాలతో కలపకుండా ఒక ప్రత్యేకమైన, స్పష్టమైన కారణంగా గుర్తించడమైంది.
దీన్ని బట్టి 2014 నుంచి 2024 వరకు జరిగిన మొత్తం విద్యార్థుల ఆత్మహత్యల్లో 21 శాతం మంది పరీక్షల్లో ఫెయిలవ్వడం వల్లనే జరిగాయని నివేదికలు చెబుతున్నాయి. ఈ కారణంగానే ఏటా 2000 మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోగా, 2014 2024 మధ్యకాలంలో 25,000 మంది పరీక్షల్లో తప్పిపోవడం వల్లనే ఆత్మహత్యలకు పాల్పడ్డారని తేలింది. వీరిలో 55 శాతం మంది 18 ఏళ్ల లోపు వారు కాగా, మరో 42 శాతం మంది 18 నుంచి 30 ఏళ్ల లోపు వారే. విద్యార్థుల ఆత్మహత్యలను కేవలం నీట్ పరీక్ష కోణంలోనే చూడలేం కానీ అత్యంత పోటీతో కూడిన ఈ నీట్ వైద్య ప్రవేశ పరీక్ష వ్యవస్థాగత అస్తవ్యస్త సమస్యలకు ప్రతీకగా మారింది. పేపర్ లీక్ కావడం, పరీక్ష హాలులోకి ప్రవేశించేటప్పుడు విద్యార్థులను అనుమానంగా తనిఖీ చేయడం, కేవలం కొన్ని కేంద్రాల నుండి మాత్రమే విద్యార్థులు అసాధారణ రీతిలో అత్యధికంగా మార్కులు సాధించడం, తదితర అనూహ్య పరిస్థితులు వివాదాలకు దారి తీస్తున్నాయి. 2015 నుంచి ఏటా 15 లక్షల మంది విద్యార్థులు నీట్ పరీక్షలకు రిజిస్టర్ చేసుకుంటున్నారు.
వీరిలో అర్హత సాధించిన అభ్యర్థుల జాబితాలో చోటు దక్కించుకున్నవారు 57 శాతం కంటే తక్కువగా ఉండడం గమనార్హం. అభ్యర్థులకు ప్రైవేట్ కోచింగ్ తప్పనిసరి అవుతోంది. అంతేకాదు చాలా మంది అర్హత సాధించడానికి మరో ఒకటి రెండు సంవత్సరాలు చదివి పరీక్షను మళ్లీ రాయవలసి వస్తోంది. ఈ పరిస్థితులు ఆయా కుటుంబాలపై తీవ్రమైన ఆర్థిక భారాన్ని మోపుతున్నాయి. సెకండరీ, హయ్యర్ సెకండరీ విద్యార్థుల్లో 35 శాతం మంది ప్రయివేట్ కోచింగ్ తీసుకుంటున్నారు. చదువులకు ఆయా కుటుంబాలు పెట్టే మొత్తం ఖర్చులో దాదాపు మూడో వంతు అంటే 33 శాతం ప్రయివేట్ కోచింగ్‌ల కోసమే వెచ్చించవలసి వస్తోంది.
కాక్రోచ్ జనతా పార్టీ పిలుపుతో దేశమంతా విద్యార్థులు, యువకులు, వారి తల్లిదండ్రులు కదం తొక్కి తమ డిమాండ్లను సాధించుకున్నప్పటికీ, విద్యార్థుల బలవన్మరణాలకు దారితీస్తున్న వాస్తవ సమస్యల మూలాలను కూకటివేళ్లతో పెకలిస్తేనే కానీ యువకుల భవితవ్యానికి మంచిరోజులు రావు. ప్రభుత్వ వ్యవస్థల్లోని లోపాలపై చెలరేగే ఎలాంటి ఆందోళనలైనా కట్టడి చేయడానికి లేదా అణచి వేయడానికి ప్రభుత్వం ఎంత ప్రయత్నిస్తున్నా వాస్తవంలో వాటి పర్యవసానాలు, తీవ్ర పరిణామాలు సమాజంలో చాలా దూరం వరకు విస్తరిస్తాయి. ఇకనైనా మోడీ ప్రభుత్వం ఈ వాస్తవాన్ని గ్రహించగలిగితేనే దేశంలో సామాజిక సామరస్య వాతావరణం ఏర్పడుతుంది.











