దేశంలో సంచలనం సృష్టించిన విద్యార్థి, యువజనోద్యమాల తర్వాతయినా తెలంగాణ యువతరం రాజకీయ ఆలోచనల్లో మార్పు వస్తుందా? పట్టభద్రుల నియోజకవర్గాలకు జరగాల్సిన ఎన్నికలకు పూర్వరంగం సిద్ధమవుతున్న తరుణంలో అందరి దృష్టీ యువతరం వైపు వెళుతోంది. ఇప్పుడి ప్పుడే తెలంగాణ యువత ఆలోచనల్లో మార్పు చోటు చేసుకుంటున్నట్టు ఇటీవలి పరిణామాలు, తాజా సర్వేల్లోనూ వ్యక్తమవుతోంది. ఇదే స్వభావం దేశమంతటికీ విస్తరించి సాధారణ ఎన్నికల నాటికి ఓ నిండుతనాన్ని సంతరించుకుంటే దేశ ఎన్నికల రాజకీయాల్లోనూ మార్పులకు వాకిళ్లు తెరచినట్టే! ఎన్నికల్లో ప్రజాభిప్రాయాన్ని ఎక్కువ ప్రభావితం చేస్తున్న డబ్బు, మద్యం, మత- కుల భావోద్వేగాల స్థానంలో యువత ‘ఆలోచన’కు తావు దొరుకుతుందా? అన్నది ప్రశ్న. సగటు మనిషి ఆలోచనే ఎన్నికల్లో ఓటు నిర్ణయాన్ని ప్రభావితం చేయగలిగితే ప్రజాస్వామ్యానికి అంతకన్నా మేలు మరేముంటుంది? ప్రొఫెసర్ నాగేశ్వర్, తీన్మార్ మల్లన్న లాంటి ప్రజాక్షేత్రం నుంచి వచ్చిన వారిని పట్టభద్రుల ఎంఎల్‌సిలుగా ఎన్నుకున్న చరిత్ర తెలంగాణకుంది. విద్యార్థి, యువజనులు చైతన్యమవుతున్న పరిస్థితుల్లో తాజా సంకేతాలు మరింత ప్రోత్సాహకరమైనవే!

‘ఇవాల్టి యువతే రేపటి నాయకులు’ అన్న నల్లసూరీడు నెల్సన్ మండేలా మాటలు అక్షర సత్యాలు. చైతన్యం కొరవడి వారు మౌనంగా అన్నీ భరిస్తున్నంత కాలం మన రాజకీయ వ్యవస్థ ఇష్టానుసారంగా యువతపై స్వారీ చేసింది. సంఖ్యాపరంగా కూడా బలమైన శక్తి అయిన ఈ దేశపు యువతను పాలకులు మొదట లక్ష్యపెట్టలేదు. 35 యేళ్ల లోపువారి జనాభా 65 శాతం ఉన్నా, రాజకీయ పార్టీ నేతల ప్రసంగాల్లో తప్ప వారి మెదడులో, ఆలోచనల్లో యువతకు చోటే దక్కలేదు. కానీ, యువతరం ఒక్కసారి జూలు విదిల్చి, గొంతెత్తి, స్థిరంగా నిలబడి హూంకరిస్తే పెత్తందారీ రాజకీయ వ్యవస్థ తోకముడిచింది. ‘నీట్’ పేపర్ల లీక్ నేపథ్యంలో.. పరీక్ష పద్ధతులు, విద్యా విధానాల్లో సంస్కరణలు, పాలకుల జవాబుదారీతనం కోరుతూ యువత ఉద్యమించి ఏలినవారిని నేలకు దించింది.

పుష్కరకాలం కేంద్ర పాలనలో లేనిది, ఒక మంత్రి జనం ఒత్తిడికి తలొగ్గి రాజీనామా చేయాల్సి వచ్చింది. ‘కాక్రోచ్’ నిరసనలు ఆరంభించి, జంతర్‌మంతర్ వేదికగా ఉద్యమాన్ని బలోపేతం చేసి, డిమాండ్లన్నీ నెరవేర్చుకున్న యువసత్తువకు జడుసుకుంది. ఒక్క దెబ్బకు ‘జీ హుజూర్ జెన్-జీ’ అంటూ ‘నాయకత్వం’ గొంతు సవరించుకుంది. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని, ముఖ్యమంత్రులు, మంత్రులు.. 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో చేసిన ప్రసంగాలన్నిటా ‘జెన్-జీ’ కేంద్ర బిందువయింది. ఏకంగా ఎర్రకోట నుంచి యేటా కోటి మంది యువకులకు కృత్రిమ మేధ (ఎఐ)లో శిక్షణ ఇప్పిస్తామనే హామీ పెగులుకొని వచ్చింది. ఈ దేశపు యువతరం తమ ఆలోచనలకు పదునుపెట్టి, ఎన్నికల ప్రక్రియను, ఫలితాల సరళిని ప్రభావితం చేస్తే.. వారికిక ఎదురుండదు. అంతటా వారి మాట చెల్లుబాటవుతుంది. పాలనా పద్ధతుల్ని సంస్కరించగలరు. ప్రజాస్వామ్య పాలనను గాడిలోపెట్టగలరు. రాజకీయ ఎజెండానే వారు శాసించగలుగుతారు.

స్పష్టమైన సంకేతాలు

యువ సంచలనం నేహా బోరా హైదరాబాద్ నగరంలోన ‘లామకాన్’లో చేసిన ప్రసంగానికి కిక్కిరిసిన జనం హాజరయ్యారు. అందులో యువత, విద్యార్థులే ఎక్కువ! ప్రజాస్వామ్యం భంగపోతున్న తీరు, వ్యవస్థల్ని చక్కదిద్దాల్సిన యువతరం బాధ్యత, తప్పు జరుగుతున్నపుడు ప్రశ్నించే కర్తవ్యాన్ని భుజాలకెత్తుకోవాల్సిన అవసరం గురించి ఆమె చెప్పిన ప్రతి వాక్యానికి మద్దతుతో కూడిన స్పందన లభించింది. రాబోయే ఎంఎల్‌సి ఎన్నికల్లో ఓటు ఎవరి సలహా, సూచన, ప్రబోధాన్ని బట్టి వేస్తారు అన్న ‘పీపుల్స్‌పల్స్ సర్వే సంస్థ’ ప్రశ్నకు తెలంగాణ పట్టభద్రుల్లో 79 శాతం మంది ‘ఎవరి సలహాతో పనిలేదు, సొంతంగా నిర్ణయం తీసుకుంటా’మని బదులిచ్చారు. ఇతరుల్ని సంప్రదిస్తాం, వింటాం, సమాలోచన చేస్తాం అన్న 21 శాతం మందిలో కూడా అత్యధికుల మొగ్గు కుటుంబ సభ్యులు, స్నేహితుల వైపే ఉంది.

యువత ఆలోచనల్ని ప్రతిబింబించే మరో అంశం బరిలోని అభ్యర్థుల్ని ఎంపిక చేసుకునే పద్ధతి. ఓటు వేసేటప్పుడు అభ్యర్థి గుణగణాలకే మొదటి ప్రాధాన్యత ఇస్తామని 39 శాతం మంది పట్టభద్రులు తెలిపారు. మరో 36 శాతం మంది పార్టీని బట్టి నిర్ణయిస్తామన్నారు. ఇక కులం ప్రాతిపదికగా (12 శాతం), డబ్బు పరంగా (5 శాతం), మతం బట్టి (2 శాతం) అభ్యర్థిని ఎంచుకుంటామన్నవారు తక్కువ శాతమే! ఈ అంశాలన్నీ కలగలిసి ప్రభావితం చేస్తాయన్నవారు 6 శాతం వరకున్నారు. రాబోయే ఎన్నికల్లో అభ్యర్థి విశ్వసనీయత, ప్రజలకు అందుబాటులో ఉండటం, ప్రజాదరణ, పట్టభద్రుల సమస్యలపై వారికుండే అవగాహన వంటివి కీలక పాత్ర పోషించనున్నట్టు సర్వేలో వెల్లడయిన గణాంకాలు చెబుతున్నాయి. ఇవన్నీ మార్పు సంకేతాలే! వచ్చే యేడు ఫిబ్రవరి- మార్చిలో ఎన్నికలు జరగాల్సిన రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గాలు ‘హైదరాబాద్ -రంగారెడ్డి- మహబూబ్‌నగర్, నల్గొండ -వరంగల్- ఖమ్మం’ ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంఎల్‌సిల పట్ల యువతలో సంతృప్తి కూడా గొప్పగా ఏం లేదు. 31 శాతం మంది ఓ మోస్తరు సంతృప్తి వ్యక్తం చేస్తే, వారి పనితీరు బాగోలేదన్నవారు 53% మంది ఉన్నారు. ఈ విషయంలో తమ అభిప్రాయాన్ని పట్టభద్రులు నిర్మొహమాటంగా, నిక్కచ్చిగానే వ్యక్తం చేస్తున్నారు.

సమస్య అదే... ప్రభావం వారే!

మిగతా విషయాలపై తెలుసుకునే ఆసక్తి ఉన్నా, తామెదుర్కొంటున్న నిరుద్యోగిత, ఉపాధి అవకాశాల లేమి తెలంగాణ యువతను బాగా ప్రభావితం చేస్తున్నాయి. ‘ఎంఎల్‌సి ఎన్నికల్లో ఓటు నిర్ణయం ముందు మిమ్మల్ని ఏ అంశం ప్రభావితం చేస్తుంద’న్న ప్రశ్నకు వారు సూటిగానే స్పందించారు. నిరుద్యోగ సమస్య అని 31 శాతం మంది నేరుగా చెబితే, మరో 24 శాతం మంది పరోక్షంగా.. జాబ్ నోటిఫికేషన్లలో జాప్యం, ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో అవకతవకలు, అవినీతి, జాప్యాలు వంటివి తమ ఆలోచనల్ని ప్రభావితం చేస్తాయని చెప్పారు. 12 శాతం మంది ప్రయివేటు సెక్టార్‌లో ఉపాధి అవకాశాలు తగ్గిపోవడం తమ ఓటు నిర్ణయాన్ని ప్రభావితం చేసే ప్రాధాన్యతాంశమనీ పేర్కొన్నారు. ప్రవేశ పరీక్షల విధానంలో లోపాలు, విద్యావ్యవస్థలోని అవకతవకలు కూడా యువత ఉద్యోగ-, ఉపాధి అవకాశాల్ని దెబ్బతీస్తున్నాయనే భావన తెలంగాణ యువతలోనూ ఉంది.

ఇదే అంశంతో ఇటీవలి ‘కాక్రోచ్ జనతా పార్టీ’ ఆవిర్భావం, ఉవ్వెత్తున ఎగిసిన విద్యార్థి- యువత ఉద్యమ ప్రభావం తమ ఆలోచనలపై ఉన్నట్టు పట్టభద్రులైన తెలంగాణ యువత భావిస్తున్నారు. అందుకే, ఆ ఉద్యమం వల్ల తమ రాజకీయ ఆలోచల్లో గణనీయమైన మార్పు వచ్చిందని 18 శాతం మంది పేర్కొంటే, ఎంతో కొంత మార్పును తెచ్చిందని 36 శాతం (మొత్తం కలిసి 54%) మంది పేర్కొనడం విశేషం. సదరు ఉద్యమం లేవనెత్తిన మౌలికాంశాలు తమను ప్రభావితం చేశాయని, తాము తీసుకోబోయే ఓటు నిర్ణయంపైన వాటి ప్రభావం ఉంటుందని 62 శాతం మంది పట్టభద్రులు పేర్కొన్నారు. యువత తాజా ఆలోచనా ధోరణి ఎంఎల్‌సి ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేస్తే రాజకీయ పక్షాలు వాటిని ఎలా పరిగణిస్తాయి? ఎట్లా స్వీకరిస్తాయి? అన్నది వేచి చూడాల్సిందే! లోగడ ఎపి పట్టభద్రుల ఎన్నికల్లో ఫలితాలు, అంతకు ముందరి అసెంబ్లీ సాధారణ ఎన్నికల్లో తమకు లభించిన ఘన విజయానికి భిన్నంగా వచ్చినపుడు వైఎస్‌ఆర్‌సిపి ముఖ్యనాయకుడొకరు విచిత్రంగా స్పందించారు. ‘ఈ ఎన్నికల్లో ఓటర్లైనవారు అసలు మా వాళ్లు కాదులే!’ అనడం పాత్రికేయులతోపాటు పలువురిని విస్మయానికి గురిచేసింది. సంఖ్య ఎంత తక్కువున్నా, పట్టభద్రులు సమాజానికి ప్రతినిధులు కాకుండా పోతారా?

పార్టీలూ గుర్తెరగాలి

తెలంగాణ యువతరం ఆలోచనా సరళిలో మార్పును ప్రధాన స్రవంతి రాజకీయ పార్టీలు గుర్తెరగాలి. ఆ మేర తమ ఆలోచన, రాజకీయ పంథా, వ్యూహాలను వారు పునర్నిర్వచించుకోవాలి. తమ అనుబంధ విభాగాల్ని బలోపేతం చేసుకోవాలి. నెలన్నర పాటు ఢిల్లీ కేంద్రకంగా, దేశ వ్యాప్తంగా అంత పెద్ద ఉద్యమం జరిగితే రాజకీయ పార్టీల అనుబంధ విద్యార్థి, యువజన విభాగాల ప్రభావమే లేదు. యువజనుల ఆలోచనల్ని ప్రభావితం చేయడం సంగతలా ఉంచి తమ ఉనికి కోసం అవి పోరాడే పరిస్థితి! ప్రవాస భారతీయుల సంస్థ (డయల్ యువర్ విలేజ్) స్థానికంగా ఉన్న ఎంవి ఫౌండేషన్ వంటి సంస్థలతో కలిసి సర్కారు బడుల్లో సంస్కరణల కోసం ‘పోస్ట్ కార్డ్’ ఉద్యమం నడిపితే స్థానికి యువజన సంఘాలు, పార్టీల అనుబంధ విభాగాలు ఏం చేస్తున్నట్టు? టీచర్ పోస్టుల ఖాళీలు, తరగతి గదుల లేమి, మంచినీరు, టాయిలెట్స్, లైబ్రరీలు, ల్యాబ్స్, క్రీడా పరికరాల వంటి మౌలిక వసతులు కల్పించాలని, అందుకు ప్రభుత్వానికి నిర్దిష్ట ఆదేశాలివ్వాలని కోరుతూ 20 వేల మంది తెలంగాణ సర్కారు బడుల విద్యార్థులు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఉత్తరాలు రాశారు. అదో ‘ఉత్తరాల ఉద్యమం’! తమ నిరసన, వినతి కూడిన ఉత్తరాలను సుమోటోగా ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిఐఎల్) గా స్వీకరించి, కేసు విచారణ జరపాలని వారా ఉత్తరాల్లో సిజెను కోరారు. ఇదొక ప్రజాస్వామ్య అభివ్యక్తి. చిన్నారి మెదళ్లలో ‘ప్రశ్నించడం’ అన్న ప్రజాస్వామిక విలువను మొక్కగా నాటిన ఈ ఉద్యమంలో స్థానిక యువత పాత్రే లేకపోవడం ఆలోచించదగ్గ విషయం. ఈ సూక్ష్మం వారు గ్రహించాలి. ఇవన్నీ వారిలో మరింత ప్రేరణ కలిగించి, తెలంగాణ యువతను ‘ఆలోచనాపరులు’గా తీర్చిదిద్దుతాయని భావిద్దాం! మంచి భవిష్యత్తును ఆశిద్దాం!!.


దిలీప్‌రెడ్డి

(రచయిత పొలిటికల్ అనలిస్ట్, డైరెక్టర్ ‘పీపుల్స్ పల్స్’ రీసెర్చ్ సంస్థ)