ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగంలో సాంకేతిక విప్లవానికి శ్రీకారం చుడుతోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత సేవలను విస్తృతంగా ప్రవేశపెట్టి దేశంలో తొలి AI ఆధారిత పర్యాటక రాష్ట్రంగా మారే దిశగా అడుగులు వేస్తోంది.

రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతాల్లో సందర్శకుల అనుభవాన్ని మెరుగుపరిచేందుకు NiVU AI ప్లాట్‌ఫామ్ సేవలను అందుబాటులోకి తీసుకురానున్నారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (APTDC), Xplorer సంస్థ మధ్య మూడేళ్ల వ్యూహాత్మక ఒప్పందం కుదిరింది.

మొదటి దశలో ఈ AI సేవలను 30 ప్రముఖ పర్యాటక ప్రాంతాల్లో ప్రారంభించి, మూడు సంవత్సరాల వ్యవధిలో రాష్ట్రవ్యాప్తంగా 100కిపైగా ప్రాంతాలకు విస్తరించనున్నట్లు అధికారులు తెలిపారు.

ఈ సాంకేతిక సేవల ప్రత్యేకత ఏమిటంటే.. పర్యాటకులు ఆయా ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన QR కోడ్‌ను స్కాన్ చేయడం ద్వారా చారిత్రక ప్రదేశాలు, కోటలు, బీచ్‌లు, గుహలు, ఇతర పర్యాటక ఆకర్షణల గురించి వివరాలను పొందవచ్చు.

NiVU AI ద్వారా పర్యాటకులు తమకు నచ్చిన భాషలో సమాచారం తెలుసుకునే అవకాశం ఉంటుంది. వాయిస్ లేదా టెక్స్ట్ రూపంలో 130కిపైగా భాషల్లో ఈ సేవలు అందుబాటులో ఉండనున్నాయి. ఈ సేవలను ఉచితంగా అందించనున్నారు.

మంగళగిరిలో నిర్వహించిన పైలట్ ప్రాజెక్ట్‌కు మంచి స్పందన వచ్చిన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ AI సేవలు ఇప్పటికే సందర్శకులకు సులభమైన, ఇంటరాక్టివ్ ప్రయాణ అనుభవాన్ని అందిస్తున్నాయని అధికారులు పేర్కొన్నారు.

పర్యాటక రంగాన్ని మరింత ఆధునీకరించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లు, సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించే దిశగా చర్యలు చేపడుతోంది. రాష్ట్ర పర్యాటక విధానంలోనూ వ్యక్తిగతీకరించిన ప్రయాణ అనుభవాలు, డిజిటల్ సేవలకు ప్రాధాన్యం ఇస్తున్నారు.

AI ఆధారిత సేవల ద్వారా దేశ, విదేశాల నుంచి వచ్చే పర్యాటకులకు మెరుగైన సమాచారం అందించడంతో పాటు, రాష్ట్రంలోని చారిత్రక, సాంస్కృతిక, ప్రకృతి పర్యాటక ప్రాంతాలకు మరింత ప్రచారం లభిస్తుందని ప్రభుత్వం భావిస్తోంది.

సాంకేతికతను పర్యాటకంతో అనుసంధానం చేయడం ద్వారా ప్రయాణాన్ని మరింత సులభతరం చేయడం, సందర్శకుల అనుభవాన్ని మెరుగుపరచడం ఈ ప్రాజెక్ట్ ప్రధాన లక్ష్యంగా ఉంది.