విశాఖపట్నంలో అగ్నివీర్‌, టెక్నికల్‌ సర్వీసెస్‌ కోసం ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ ర్యాలీ ప్రారంభమైంది. బుధవారం అర్ధరాత్రి నుంచి మొదలైన ఈ ఎంపిక ప్రక్రియ సెప్టెంబర్‌ 20 వరకు కొనసాగనుంది. ఆన్‌లైన్‌ రాత పరీక్షలో అర్హత సాధించిన 10,355 మంది అభ్యర్థులు ర్యాలీలో పాల్గొంటున్నారు.

తొలి రోజు అభ్యర్థులకు ఆర్‌కే బీచ్‌ రోడ్డులో 1.6 కిలోమీటర్ల నైట్‌ రన్‌ నిర్వహించారు. కాళీమాత ఆలయం నుంచి విక్టరీ ఎట్‌ సీ వార్‌ మెమోరియల్‌ వరకు ఈ రన్‌ జరిగింది. ప్రతిరోజూ సగటున 800 మంది అభ్యర్థులు నైట్‌ రన్‌లో పాల్గొననున్నారు.

నైట్‌ రన్‌లో అర్హత సాధించిన వారికి మున్సిపల్‌ స్టేడియంలో మిగిలిన ఫిజికల్‌ ఈవెంట్స్‌ నిర్వహిస్తారు. ర్యాలీ సజావుగా సాగేందుకు పోలీస్‌, ఫైర్‌ సర్వీసెస్‌, జీవీఎంసీ, రెవెన్యూ శాఖల అధికారులు అవసరమైన ఏర్పాట్లు చేశారు.

అభ్యర్థులకు రవాణా, విద్యుత్‌ సరఫరా, సీసీ కెమెరాలు, పబ్లిక్‌ అడ్రస్‌ సిస్టమ్‌, ఐటీ సదుపాయాలు అందుబాటులో ఉండేలా చూడాలని జిల్లా కలెక్టర్‌ ఎం. అభిషిక్త్‌ కిషోర్‌ అధికారులను ఆదేశించారు.

ఇక ర్యాలీ నేపథ్యంలో సెప్టెంబర్‌ 20 వరకు రాత్రి 11 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు ఆర్‌కే బీచ్‌పై ట్రాఫిక్‌ ఆంక్షలు అమల్లో ఉంటాయి.