భారత రక్షణ సామర్థ్యాలను మరింత బలోపేతం చేసే దిశగా డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్‌డీఓ) మరో కీలక మైలురాయిని అధిగమించింది. పూర్తిగా స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన లాంగ్ రేంజ్ ల్యాండ్ అటాక్ క్రూయిజ్ మిస్సైల్ (LRLACM)ను సోమవారం విజయవంతంగా పరీక్షించింది.

ఒడిశా తీరంలోని డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ద్వీపం నుంచి నిర్వహించిన ఈ ప్రయోగం భారత రక్షణ రంగ చరిత్రలో మరో గర్వకారణంగా నిలిచింది. పరీక్ష సందర్భంగా నిర్దేశించిన అన్ని లక్ష్యాలను క్షిపణి విజయవంతంగా చేరుకొని తన సామర్థ్యాన్ని నిరూపించిందని డీఆర్‌డీఓ వెల్లడించింది.

చాందీపూర్‌లోని ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్‌కు చెందిన ఆధునిక ట్రాకింగ్ వ్యవస్థలు, సెన్సార్లు సేకరించిన డేటా ప్రకారం క్షిపణి నిర్దేశిత మార్గంలో ఖచ్చితంగా ప్రయాణించి అద్భుత పనితీరును ప్రదర్శించినట్లు అధికారులు తెలిపారు.

ఈ క్షిపణిలో ఉపయోగించిన అన్ని కీలక ఉపవ్యవస్థలను డీఆర్‌డీఓకు చెందిన వివిధ ప్రయోగశాలలు, భారతీయ పరిశ్రమ భాగస్వాములు సంయుక్తంగా అభివృద్ధి చేశాయి. బెంగళూరులోని ఏరోనాటికల్ డెవలప్‌మెంట్ ఎస్టాబ్లిష్‌మెంట్ (ADE) ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టుకు ప్రధాన కేంద్రంగా వ్యవహరించింది.

స్వదేశీ రక్షణ తయారీ, ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యాలకు ఈ విజయవంతమైన ప్రయోగం మరింత బలం చేకూర్చిందని రక్షణ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.