మంగళగిరి పానకాల స్వామి కొండపై అరుదైన పునుగు పిల్లి ప్రత్యక్షమైంది. ఇటీవల ఘాట్‌ రోడ్డు మార్గంలో వెళ్తున్న కొందరు భక్తులకు రాళ్ల మధ్య దాక్కొని ఉన్న పునుగు పిల్లి కనిపించింది. దీంతో వారు వెంటనే ఫొటోలు, వీడియోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేయగా.. అవి వైరల్‌గా మారాయి.

సాధారణంగా రాత్రి వేళల్లో సంచరించే పునుగు పిల్లులు పండ్లు, చిన్న చిన్న కీటకాలను ఆహారంగా తీసుకుంటాయి. శేషాచలం, నల్లమల అటవీ ప్రాంతాల్లో ఇవి ఎక్కువగా కనిపిస్తుంటాయి. అయితే నిత్యం భక్తులతో రద్దీగా ఉండే మంగళగిరి పానకాల స్వామి కొండపై పునుగు పిల్లి కనిపించడంతో భక్తులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

పునుగు పిల్లి నుంచి ప్రత్యేకమైన సువాసన కలిగిన ద్రవం విడుదలవుతుందని.. దాన్ని సేకరించి సుగంధ తైలంగా ఉపయోగిస్తారని చెబుతున్నారు. తిరుమల శ్రీవారి అభిషేకం అనంతరం ఈ తైలాన్ని ఉపయోగించే సంప్రదాయం కూడా ఉంది.

పునుగు పిల్లుల్లో దాదాపు 38 జాతులు ఉన్నట్లు సమాచారం. మంగళగిరిలో కనిపించిన పునుగు పిల్లి ఏ జాతికి చెందినదో అటవీ శాఖ అధికారులు నిర్ధారించాల్సి ఉంది.