ఏపీలోని నంద్యాల జిల్లా అవుకు మండలం రామాపురం వద్ద విషాద ఘటన చోటుచేసుకుంది. జీఎన్‌ఎస్‌ఎస్ హెడ్ రెగ్యులేటర్ సమీపంలో ప్రమాదవశాత్తూ కాలువలో పడిపోయి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు గల్లంతయ్యారు.

పోలీసుల సమాచారం ప్రకారం.. గల్లంతైన వారిలో అప్రోజ్‌ (30), అతని కుమారుడు ఆరిష్‌ (7), ఆసిఫ్‌ (40) ఉన్నారు. అప్రోజ్‌, ఆరిష్‌ తండ్రి, కుమారులు కాగా.. ఆసిఫ్‌ అప్రోజ్‌కు వరుసకు బావమరిది అని కుటుంబ సభ్యులు తెలిపారు.

ముగ్గురూ కాలువలో పడిపోయిన విషయం తెలుసుకున్న అవుకు పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్నారు. స్థానికుల సహకారంతో గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు ప్రారంభించారు.

కాలువలో నీటి ప్రవాహం, లోతును దృష్టిలో ఉంచుకుని గాలింపు కొనసాగిస్తున్నారు. అవసరమైతే ప్రత్యేక గజ ఈతగాళ్ల సహాయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ఒకే కుటుంబానికి చెందిన తండ్రి, కుమారుడు, బావమరిది గల్లంతవడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.