అఖిల్ అక్కినేని హీరోగా నటించిన ‘లెనిన్’ సినిమా విజయోత్సవ వేడుకలో హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే భావోద్వేగానికి లోనయ్యారు. వేదికపై ప్రసంగిస్తూ అభిమానులు, చిత్రబృందానికి కృతజ్ఞతలు తెలుపుతున్న సమయంలో ఆమె కన్నీళ్లు ఆపుకోలేకపోయారు. ఆమె భావోద్వేగ ప్రసంగానికి అక్కడున్నవారు చప్పట్లతో అభినందనలు తెలిపారు.

ముందుగా దర్శకుడు మురళీ కిషోర్కు ధన్యవాదాలు తెలిపిన భాగ్యశ్రీ, తనకు ‘భారతి’ పాత్రను ఇవ్వకపోయి ఉంటే ఈ ప్రశంసలు దక్కేవి కావని అన్నారు. తనపై నమ్మకం ఉంచి ఆ పాత్రను ఇచ్చిన దర్శకుడికి జీవితాంతం రుణపడి ఉంటానని చెప్పారు.

హీరో అఖిల్ అక్కినేని గురించి మాట్లాడుతూ, గత పదేళ్లలో ఆయన ప్రయాణం పూర్తిగా తెలియకపోయినా, ఈ సినిమా కోసం ఆయన ఎంత కష్టపడ్డారో తన కళ్లారా చూశానని పేర్కొన్నారు. "రక్తం, చెమట, కన్నీళ్లు పెట్టి పనిచేశావు. ఈ విజయానికి నువ్వు పూర్తిగా అర్హుడివి. ఇక నుంచి నీకు మరింత ప్రేమ, ఆదరణ లభిస్తుంది" అంటూ అఖిల్‌ను అభినందించారు.

అనంతరం అభిమానులను ఉద్దేశించి మాట్లాడిన భాగ్యశ్రీ, గత ఏడాదిన్నర కాలంలో తాను నిరుత్సాహానికి గురైన ప్రతిసారి అభిమానుల సందేశాలు, సోషల్ మీడియా పోస్టులు, ప్రోత్సాహమే తనకు ధైర్యం ఇచ్చాయని చెప్పారు. "ఈ రోజు నేను ఈ వేదికపై నిలబడటానికి కారణం మీరే" అని చెప్పే సమయంలో ఆమె భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకున్నారు.

కొద్దిసేపటి తర్వాత తేరుకుని మాట్లాడిన ఆమె, "హైదరాబాద్ నా కర్మభూమి. నా చివరి సినిమా కూడా ఇక్కడే చేయాలని కోరుకుంటున్నాను" అని చెప్పడంతో సభలో చప్పట్ల సందడి నెలకొంది. ఆమె ప్రసంగానికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.