నేచురల్ స్టార్ నాని హీరోగా, శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన ‘ది ప్యారడైజ్’ సినిమా విడుదలకు సిద్ధమైంది. తెలంగాణ సంస్కృతి, భాష, వాతావరణాన్ని ప్రతిబింబించేలా రూపొందుతున్న ఈ సినిమాకు థియేటర్ ఎక్స్‌పీరియన్స్‌లోనూ తెలంగాణ రుచిని జోడించారు.

మైత్రీ థియేటర్స్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని మైత్రీ విమల్, మైత్రీ శివ గంగా థియేటర్లలో ‘ది ప్యారడైజ్’ ప్రేక్షకులకు ఇంటర్వెల్ సమయంలో సర్వపిండిని ప్రత్యేక స్నాక్‌గా అందించనున్నారు.

తెలంగాణలో ఎంతో ప్రాచుర్యం పొందిన సంప్రదాయ పిండివంటల్లో సర్వపిండికి ప్రత్యేక స్థానం ఉంది. సినిమా కథలో తెలంగాణ నేపథ్యాన్ని ప్రతిబింబిస్తున్న నేపథ్యంలో.. తెరపై మాత్రమే కాకుండా ప్రేక్షకుల ఫుడ్ ఎక్స్‌పీరియన్స్‌లోనూ ఆ స్థానికతను తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ ఏర్పాటును చేసినట్లు తెలుస్తోంది.

ఈ ప్రత్యేక సర్వపిండిని ‘బామ్మ స్టోరీస్’కు చెందిన 77 ఏళ్ల బామ్మ తయారు చేస్తున్నట్లు చిత్ర బృందం వెల్లడించింది. చిన్న టిఫిన్ సెంటర్‌లో తయారయ్యే తెలంగాణ సంప్రదాయ వంటకం ఇప్పుడు సినిమా థియేటర్ ఇంటర్వెల్ మెనూలోకి రావడం ప్రత్యేక ఆకర్షణగా మారింది.

‘ది ప్యారడైజ్’కు నాని ప్రధాన పాత్రలో నటించగా, కయాదు లోహర్ హీరోయిన్‌గా కనిపించనున్నారు. మోహన్ బాబు, సోనాలి కులకర్ణి, రాఘవ్ జుయల్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సుధాకర్ చెరుకూరి నిర్మించారు.

ఈ సినిమా సెప్టెంబర్ 24, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. నైజాం ప్రాంతంలో ప్రీమియర్ షోలు సెప్టెంబర్ 23 రాత్రి నుంచే ప్రారంభం కానున్నాయి.

సినిమా చూసే సమయంలో తెలంగాణ సంప్రదాయ సర్వపిండిని ఆస్వాదించే అవకాశం కల్పించడంతో ‘ది ప్యారడైజ్’ థియేటర్ ఎక్స్‌పీరియన్స్‌పై కూడా ఆసక్తి పెరుగుతోంది.