మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన ‘పెద్ది’ సినిమా ఘన విజయం సాధించిన నేపథ్యంలో హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో నిర్వహించిన ‘పెద్ది మెగా బ్లాక్‌బస్టర్ ఈవెంట్’లో మెగాస్టార్ చిరంజీవి భావోద్వేగ ప్రసంగంతో అభిమానులను ఆకట్టుకున్నారు. కుమారుడు రామ్ చరణ్ నటనను ప్రశంసిస్తూ, “ఇప్పట్నుంచి చిరంజీవి కాదు.. చరణ్ జీవి” అంటూ చేసిన వ్యాఖ్యలు సభలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

చిరంజీవి మాట్లాడుతూ.. “తోటి నటుడిగా చరణ్‌ను అభినందిస్తున్నాను. తండ్రిగా గర్వపడుతున్నాను. మగధీర, ట్రిపుల్ ఆర్, రంగస్థలం తర్వాత ఇంత తక్కువ వ్యవధిలో ‘పెద్ది’లాంటి సినిమా వస్తుందని ఊహించలేదు. సినిమా చూస్తున్నప్పుడు చరణ్ కనిపించలేదు.. పెద్ది పాత్ర మాత్రమే కనిపించింది. కథను పూర్తిగా నమ్మి అంకితభావంతో పనిచేయడం వల్లే ఆ స్థాయి నటన సాధ్యమైంది” అని అన్నారు.

ఈ చిత్రంలో చరణ్ నటన ప్రేక్షకులను నవ్వించడమే కాకుండా భావోద్వేగాలకు గురిచేసిందని పేర్కొన్న చిరంజీవి, “నిజమైన నటన అంటే కేవలం ముఖ కవళికలు కాదు.. మనసులోని భావాలను కళ్ల ద్వారా వ్యక్తపరచడం. ‘పెద్ది’లో చరణ్ అదే చేశాడు. స్టార్ హీరో కొడుకుగా సులభ మార్గం ఎంచుకోవచ్చు. కానీ అతడు అలా చేయకుండా పాత్ర కోసం ప్రాణం పెట్టి పనిచేశాడు” అని కొనియాడారు.

‘రంగస్థలం’ సినిమాకే జాతీయ అవార్డు వస్తుందని దర్శకుడు సుకుమార్ ఎన్నోసార్లు చెప్పారని గుర్తుచేసుకున్న చిరంజీవి, “పెద్ది’లో చరణ్ ఇచ్చిన నటన జాతీయ అవార్డు స్థాయిలో ఉందని అందరూ అంటున్నారు. అవార్డు వచ్చినా రాకపోయినా ప్రేక్షకుల మనసులు గెలుచుకోవడం గొప్ప విజయం” అన్నారు.

సినిమా చిత్రీకరణ సమయంలో చరణ్ కంటికి తీవ్ర గాయం అయిన ఘటనను ప్రస్తావిస్తూ, “ఒకరోజు షూటింగ్‌లో అతడికి చాలా పెద్ద ప్రమాదం జరిగింది. కన్నే పోయే పరిస్థితి వచ్చింది. ప్రమాదం తప్పిందని తెలిసి ఊపిరి పీల్చుకున్నాం. ఇలాంటి సంఘటనలు చూసినప్పుడు నటుడిగా, తండ్రిగా గర్వంతో పాటు ఆందోళన కూడా కలుగుతుంది” అని చెప్పారు.

తన కెరీర్ ప్రారంభ రోజుల్లో చేసిన ప్రమాదకర సన్నివేశాలను గుర్తుచేసుకున్న చిరంజీవి, “గూండా సినిమా సమయంలో రైలు కింద రాడ్ పట్టుకుని ప్రయాణించే సన్నివేశం చేశాను. అప్పుడు మా నాన్నగారు ఆందోళన చెందారు. ఇప్పుడు చరణ్ కష్టపడటం చూస్తుంటే ఆయన మాటల అర్థం తెలుస్తోంది” అని అన్నారు.

చివరగా రామ్ చరణ్‌పై ప్రశంసల వర్షం కురిపించిన చిరంజీవి, “కష్టం లేకుండా విజయం రాదు. ఈరోజు కూడా మేం కష్టపడుతూనే ఉన్నాం. దేశ ప్రధాని మోదీ కూడా రామ్ చరణ్‌ను ‘న్యూ ఏజ్ మెగాస్టార్’గా అభివర్ణించారు. ‘పెద్ది’ విజయంతో పూర్తిస్థాయిలో పుత్రోత్సాహం అనుభవిస్తున్నాను” అంటూ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు.