రాయలసీమ యాసతో తెలుగు ప్రేక్షకులను మెప్పించిన ప్రముఖ నటుడు, కమెడియన్ జయప్రకాశ్ రెడ్డి వర్ధంతి సందర్భంగా అభిమానులు ఆయనను స్మరించుకుంటున్నారు. విలన్‌గా సినీ ప్రయాణాన్ని ప్రారంభించి.. ఆ తర్వాత హాస్యనటుడిగా తనదైన ముద్ర వేసిన జయప్రకాశ్ రెడ్డి.. ఎన్నో విభిన్న పాత్రలతో ప్రేక్షకుల హృదయాల్లో చెరగని స్థానం సంపాదించుకున్నారు.

1946 మే 8న కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ మండలంలోని శిరువెళ్ల గ్రామంలో ఓ వ్యవసాయ కుటుంబంలో జన్మించిన జయప్రకాశ్ రెడ్డికి చిన్నప్పటి నుంచే నాటకాలంటే ఎంతో ఆసక్తి. ఆయన తండ్రి కూడా నటుడు కావడంతో.. తండ్రీకొడుకులు కలిసి నాటకాల్లో నటించేవారు.

చదువులోనూ ముందుండే ఆయన.. డిగ్రీ అనంతరం ఉపాధ్యాయ శిక్షణ పూర్తి చేసి గణిత ఉపాధ్యాయుడిగా పనిచేశారు. అయితే నటనపై ఉన్న ఆసక్తితో నాటక రంగంలో కొనసాగుతూ.. సినిమాల్లోకి అడుగుపెట్టారు.

1997లో విడుదలైన ‘ప్రేమించుకుందాం రా’ సినిమాతో విలన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత ‘సమరసింహారెడ్డి’, ‘నరసింహనాయుడు’ వంటి చిత్రాల్లో ప్రతినాయక పాత్రలతో మెప్పించారు.

ఆ తర్వాత కామెడీ వైపు అడుగులు వేసిన జయప్రకాశ్ రెడ్డి.. ‘కింగ్’, ‘రెడీ’, ‘ఆట’, ‘కిక్’, ‘షాడో’, ‘పండగ చేస్కో’, ‘సిల్లీ ఫెలోస్’ తదితర సినిమాల్లో తనదైన కామెడీ టైమింగ్‌తో నవ్వులు పూయించారు.

ముఖ్యంగా ఆయన పలికే రాయలసీమ యాసలోని సంభాషణలు ప్రేక్షకులకు ఎంతో ప్రత్యేకంగా నిలిచాయి. విలన్‌గా భయపెట్టినా.. కమెడియన్‌గా నవ్వించినా.. ప్రతి పాత్రలోనూ తనదైన ముద్ర వేసుకున్నారు.

అలా తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న జయప్రకాశ్ రెడ్డి.. 2020 సెప్టెంబర్ 8న గుండెపోటుతో కన్నుమూశారు.

ఆయన భౌతికంగా దూరమైనా.. తన నటనతో, హాస్యంతో, రాయలసీమ యాసతో ప్రేక్షకుల జ్ఞాపకాల్లో ఎప్పటికీ నిలిచిపోతారు.

విలక్షణ నటుడికి వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు!