టాలీవుడ్‌కు చెందిన ప్రముఖ నిర్మాత, అన్నపూర్ణ స్టూడియోస్ ప్రతినిధి సుప్రియ యార్లగడ్డకు కేంద్ర ప్రభుత్వం కీలక బాధ్యత అప్పగించింది. కేంద్ర సెన్సార్ బోర్డు (CBFC) సభ్యురాలిగా ఆమె నియమితులయ్యారు. కేంద్ర ప్రభుత్వం సీబీఎఫ్‌సీని పునర్‌వ్యవస్థీకరిస్తూ 18 మంది సభ్యులతో కొత్త జాబితాను ప్రకటించగా.. తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి సుప్రియకు అవకాశం దక్కింది.
ఈ మేరకు కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ సెప్టెంబర్ 16న అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. సినిమాటోగ్రాఫ్ చట్టంలోని నిబంధనల ప్రకారం ఈ నియామకాలు చేపట్టినట్లు వెల్లడించింది. కొత్తగా నియమితులైన సభ్యుల పదవీకాలం మూడేళ్ల పాటు కొనసాగనుంది. ఈ నియామక ఉత్తర్వులు తక్షణమే అమల్లోకి వస్తాయని కేంద్రం స్పష్టం చేసింది.
సీబీఎఫ్‌సీ కొత్త సభ్యుల జాబితాలో సుప్రియ యార్లగడ్డతో పాటు బాలీవుడ్ నటులు ప్రీతి జింటా, సునీల్ శెట్టి, పంకజ్ త్రిపాఠి, ప్రముఖ దర్శకుడు ప్రియదర్శన్, బెంగాలీ నటుడు ప్రసేన్‌జిత్ ఛటర్జీ తదితరులు ఉన్నారు. అలాగే వినోద్ అనుపమ్, మనోజ్ జోషి, అభిషేక్ జైన్, రిక్కీ కేజ్, హన్సరాజ్ హన్స్, యతీంద్ర మిశ్రా, రూపాలీ గంగూలీ, నీల మదబ్ పాండా, పల్లవి జోషి, నిషిగంధ వాద్, వామన్ కేండ్రే, రమేశ్ పతంగె తదితరులకు కూడా సభ్యులుగా అవకాశం కల్పించారు.
కాగా, కొత్త నియామకాలపై ప్రస్తుతం మిశ్రమ స్పందనలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా దేశంలోని అతిపెద్ద చిత్ర పరిశ్రమల్లో ఒకటైన తమిళ సినీ పరిశ్రమకు తగిన ప్రాతినిధ్యం దక్కలేదంటూ సోషల్ మీడియా వేదికగా కొందరు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.














