యశ్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్’ ట్రైలర్ విడుదల సందర్భంగా నటి నయనతార ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

ఈ సినిమాలో నటించేందుకు మొదట తనకు ఆసక్తి లేదని, భారీ తారాగణం ఉండటంతో తన పాత్రకు ఎంత ప్రాధాన్యం ఉంటుందో అనే సందేహం కలిగిందని ఆమె తెలిపారు. అందుకే ప్రారంభంలో ఈ ఆఫర్‌ను తిరస్కరించినట్లు చెప్పారు.

అయితే దర్శకురాలు గీతూ మోహన్‌దాస్ కనీసం ఒకసారి కథ వినాలని కోరడంతో ఆమెను కలిశానని నయనతార చెప్పారు. కథ విన్న తర్వాత మాత్రం తన ఆలోచన పూర్తిగా మారిపోయిందని వెల్లడించారు.

గీతూ మోహన్‌దాస్ కథ చెప్పిన తీరు, పాత్రలను మలిచిన విధానం, సినిమాపై ఆమెకున్న స్పష్టమైన విజన్ తనను ఎంతో ఆకట్టుకున్నాయని నయనతార తెలిపారు. కథ పూర్తయ్యేలోపే ఈ సినిమా తప్పకుండా చేయాలని నిర్ణయించుకున్నానని చెప్పారు.

ఈ సందర్భంగా హీరో యశ్పై కూడా నయనతార ప్రశంసలు కురిపించారు. ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి యశ్ సుమారు నాలుగున్నరేళ్ల పాటు ఎంతో అంకితభావంతో పనిచేశారని, ఆయన కృషి నిజంగా అభినందనీయమని పేర్కొన్నారు.

సాధారణంగా సినిమా ప్రమోషన్లకు దూరంగా ఉండే నయనతార, ‘టాక్సిక్’ ట్రైలర్ లాంచ్‌కు మాత్రం ప్రత్యేకంగా హాజరయ్యారు. యశ్ స్వయంగా ఫోన్ చేసి ఆహ్వానించడంతో పాటు, ఈ సినిమాపై తనకున్న నమ్మకమే కార్యక్రమానికి రావడానికి కారణమని ఆమె వెల్లడించారు.

గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో యశ్, నయనతార, కియారా అద్వానీ, హ్యూమా ఖురేషి, తారా సుతారియా, రుక్మిణి వసంత్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రం ఈ ఏడాది అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారతీయ సినిమాల్లో ఒకటిగా నిలిచింది.