అమెరికా హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం (DHS) గ్రీన్ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకున్న చాలా మంది వలసదారులు తమ దరఖాస్తులు పరిశీలనలో ఉన్నంత వరకు అమెరికాలోనే ఉండవచ్చని స్పష్టం చేసింది. ఇటీవల వచ్చిన ప్రకటనతో దరఖాస్తుదారులు తమ స్వదేశాలకు వెళ్లి అక్కడే వేచి ఉండాల్సి వస్తుందనే ఆందోళనలు వ్యక్తమయ్యాయి.
అయితే, గ్రీన్ కార్డ్ ప్రక్రియలో ఎలాంటి పెద్ద మార్పులు చేయలేదని DHS తెలిపింది. ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే కేసు ఆధారంగా అధికారులు విదేశాల నుంచి ప్రక్రియ పూర్తి చేయాలని సూచించే అధికారం కలిగి ఉన్నారని పేర్కొంది. సాధారణంగా గ్రీన్ కార్డ్ కోసం దరఖాస్తు చేసిన వారిలో అధిక శాతం మంది అమెరికాలోనే ఉండి తమ దరఖాస్తుల ఫలితాన్ని ఎదురుచూడవచ్చని అధికారులు స్పష్టం చేశారు.
వీసా గడువు మించిపోవడం వంటి కొన్ని అంశాలు వ్యక్తిగత కేసులపై ప్రభావం చూపవచ్చని తెలిపినా, ఎవరిని విదేశాలకు పంపవచ్చనే విషయంలో ఇంకా స్పష్టమైన మార్గదర్శకాలు విడుదల కాలేదు. దీంతో ప్రస్తుతం గ్రీన్ కార్డ్ దరఖాస్తుదారులకు DHS ప్రకటన పెద్ద ఊరటనిచ్చింది.










