లడఖ్‌లో బాలికల రుతుక్రమ ఆరోగ్యం మెరుగుపర్చడంతో పాటు మహిళల స్వయం సహాయక సంఘాలకు ఊతమివ్వడానికి కీలక నిర్ణయం తీసుకున్నారు. లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా, సఖీ జామో విలేజ్ ఆర్గనైజేషన్ నుంచి మూడు లక్షల బయోడిగ్రేడబుల్ శానిటరీ న్యాప్కిన్ల కొనుగోలుకు ఆమోదం తెలిపారు. ఈ సంస్థకు భారత సైన్యం, లడఖ్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్ మద్దతు ఇస్తున్నాయి.

ప్రస్తుతం లడఖ్‌లో ప్రతి నెల 13 లక్షల శానిటరీ ప్యాడ్లు బాలికలకు పంపిణీ చేస్తున్నారు. ఇందులో మూడు లక్షల ప్యాడ్లు ఇకపై స్థానిక మహిళా సంఘం నుంచే కొనుగోలు చేయనున్నారు. మిగిలినవి టెండర్ల ద్వారా సేకరిస్తారు. ఒక్కో ప్యాడ్ ధర ఐదు రూపాయలు కాగా, మొత్తం ప్రాజెక్ట్ ఖర్చు 15 లక్షల రూపాయలు.

ఈ ప్యాడ్లు పూర్తిగా బయోడిగ్రేడబుల్ కావడంతో పర్యావరణానికి హాని ఉండదని అధికారులు తెలిపారు. ముఖ్యంగా లడఖ్ వంటి సున్నితమైన పర్యావరణ ప్రాంతంలో ఇది ఎంతో ఉపయోగకరమని పేర్కొన్నారు.

మార్ట్‌సెలాంగ్ గ్రామంలోని బయోనాప్ తయారీ కేంద్రం ప్రస్తుతం 26 మంది మహిళలకు ఉపాధి కల్పిస్తోంది. వీరిలో సైనికుల కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు. మహిళల ఆరోగ్యం, ఉపాధి, గ్రామీణ ఆర్థికాభివృద్ధి లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.