వేసవిలో ఖరీదైన ఎనర్జీ డ్రింక్స్ అవసరం లేకుండా కేవలం రూ.10తోనే ఆరోగ్యాన్ని కాపాడుకునే సూపర్ హెల్తీ డ్రింక్ ఇప్పుడు వైరల్ అవుతోంది. సోంపు, ఎండుద్రాక్షతో తయారయ్యే ఈ నీరు శరీరాన్ని చల్లగా ఉంచడంతో పాటు ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్‌ను కాపాడుతుందని నిపుణులు చెబుతున్నారు.

సోంపులో ఉండే చలవ గుణాలు కడుపులోని ఎసిడిటీ, గుండెల్లో మంటను తగ్గిస్తాయి. ఎండుద్రాక్షలో ఉండే ఐరన్, పొటాషియం శరీరానికి తక్షణ శక్తిని అందిస్తాయి. దీంతో గ్యాస్, అల్సర్ సమస్యలు కూడా తగ్గుముఖం పడతాయి.

ఇక మలబద్ధకం సమస్యతో బాధపడేవారికి కూడా ఇది మంచి ఉపశమనం ఇస్తుంది. సోంపులోని జీర్ణ ఎంజైమ్స్, ఎండుద్రాక్షలోని ఫైబర్ ప్రేగుల పనితీరును మెరుగుపరుస్తాయి. రక్తంలోని మలినాలను తొలగించి చర్మాన్ని కాంతివంతంగా మారుస్తాయని చెబుతున్నారు.

వేసవిలో చెమట ద్వారా కోల్పోయే లవణాలను తిరిగి భర్తీ చేయడంలో కూడా ఈ నీరు ఉపయోగపడుతుంది. అలసట, తలనొప్పి, కాళ్ల నొప్పులు తగ్గడంతో పాటు ఎండదెబ్బ నుంచి రక్షణ కల్పిస్తుంది. ఉదయాన్నే పరగడుపున తాగితే బరువు తగ్గడానికీ సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

తయారీ విధానం చాలా సులభం. ఒక గ్లాసు నీటిలో 10 నుంచి 15 ఎండుద్రాక్షలు, ఒక టేబుల్ స్పూన్ సోంపు వేసి రాత్రంతా నానబెట్టాలి. ఉదయం ఆ నీటిని వడకట్టి పరగడుపున తాగాలి. నానిన ఎండుద్రాక్ష, సోంపును కూడా నమిలి తింటే మరింత ప్రయోజనం ఉంటుంది.

అయితే డయాబెటిస్ ఉన్నవారు లేదా విరేచనాలతో బాధపడేవారు ఈ నీటిని తాగే ముందు వైద్యుల సలహా తీసుకోవాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. రోజుకు ఒక గ్లాసుకంటే ఎక్కువ తాగకూడదని సూచిస్తున్నారు.