వైద్య రంగంలో మరో అద్భుతమైన ముందడుగు నమోదైంది. దెబ్బతిన్న శ్వాసనాళం కోసం ఇకపై డోనర్ అవయవం అవసరం లేకపోవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దక్షిణ కొరియాలోని కాథలిక్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు రోగి సొంత కణాలను ఉపయోగించి 3డీ ప్రింటింగ్ సాంకేతికతతో కృత్రిమ శ్వాసనాళాన్ని రూపొందించి విజయవంతంగా అమర్చారు. బయోడీగ్రేడబుల్ స్కాఫోల్డ్‌పై రోగి మూలకణాలను నాటి, అవి సహజ కణజాలంగా అభివృద్ధి చెందేలా చేశారు. దీంతో శరీరం తిరస్కరించే ప్రమాదం తగ్గుతుంది. ఇమ్యూన్ సప్రెసెంట్ మందుల అవసరం కూడా ఉండదు. డోనర్ అవయవాల కోసం ఎదురుచూడాల్సిన అవసరం లేకుండా, రోగి శరీర నిర్మాణానికి అనుగుణంగా శ్వాసనాళాన్ని తయారు చేయవచ్చు. భవిష్యత్తులో రక్తనాళాలు, కార్టిలేజ్ వంటి ఇతర అవయవాల తయారీకీ ఈ సాంకేతికత దారి చూపనుంది.