అమెరికాలో హెచ్-1బీ వీసాదారుల జీవిత భాగస్వాములకు ట్రంప్ ప్రభుత్వం కీలక షాక్ ఇచ్చేందుకు సిద్ధమవుతోందా? కొన్ని హెచ్-4 వీసా హోల్డర్లకు ఇచ్చే వర్క్ పర్మిట్లను తొలగించే ప్రతిపాదనను డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ పరిశీలిస్తోంది.
ఒబామా హయాంలో తీసుకొచ్చిన విధానం ప్రకారం.. అర్హత కలిగిన కొందరు హెచ్-4 డిపెండెంట్ స్పౌజ్‌లు అమెరికాలో ఉద్యోగం చేసుకునేందుకు Employment Authorization Document (EAD) పొందే అవకాశం ఉంది. అయితే తాజా ప్రతిపాదన అమల్లోకి వస్తే.. ఈ అవకాశం కొన్ని వర్గాలకు లేకుండా పోవచ్చు.
అయితే ఇది ఇప్పటికీ ప్రారంభ దశలోనే ఉంది. DHS ఇంకా అధికారికంగా ప్రతిపాదిత నిబంధనలను విడుదల చేయలేదు. ప్రస్తుతం ఉన్న వర్క్ పర్మిట్ హోల్డర్లపై ప్రభావం ఉంటుందా? ఎంతమంది ఉద్యోగ అనుమతిని కోల్పోతారు? అనే విషయాలపై కూడా స్పష్టత లేదు.
నిబంధన మార్పు అమల్లోకి రావాలంటే ముందుగా ప్రతిపాదిత రూల్‌ను ప్రచురించాలి. అనంతరం ప్రజల నుంచి అభిప్రాయాలు స్వీకరించి, వాటిని పరిశీలించిన తర్వాత తుది నిబంధనను జారీ చేయాల్సి ఉంటుంది. ఈ నిర్ణయంపై న్యాయపరమైన సవాళ్లు ఎదురయ్యే అవకాశం కూడా ఉంది.













