నేపాల్‌లోని రసువా జిల్లాలో బుధవారం సంభవించిన భారీ ఆకస్మిక వరదలు తీవ్ర విధ్వంసం సృష్టించాయి. టిబెట్ సరిహద్దు ప్రాంతంలో భోటే కోసి నది ఉప్పొంగడంతో ఇళ్లు, రహదారులు, వంతెనలు, వాహనాలు, విద్యుత్ ప్రాజెక్టులు దెబ్బతిన్నాయి. తాజా ప్రాథమిక సమాచారం ప్రకారం 384 మంది ప్రయాణికులు ఆచూకీ లేకుండా ఉన్నారు. వీరిలో 105 మంది భారతీయులు, 37 మంది ఎన్‌ఆర్‌ఐలు ఉన్నారు.
అయితే ‘ఆచూకీ గల్లంతు’ అంటే వారు వరదల్లో కొట్టుకుపోయారని నిర్ధారణ కాదని అధికారులు తెలిపారు. వరదల కారణంగా రహదారులు, కమ్యూనికేషన్ వ్యవస్థలు దెబ్బతినడంతో పలువురిని సంప్రదించలేకపోతున్నారని చెప్పారు.
కైలాశ్ మానస సరోవర్ యాత్రికుల్లోనూ పలువురు
ఆచూకీ లేని భారతీయుల్లో పలువురు కైలాశ్ మానస సరోవర్ యాత్రకు వెళ్తున్న యాత్రికులు ఉన్నట్లు సమాచారం. నేపాల్ టూరిజం బోర్డు ప్రకారం ఆచూకీ లేని 384 మందిలో 291 మంది విదేశీయులు, 93 మంది నేపాలీ పౌరులు ఉన్నారు. అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా, మలేషియా, దక్షిణాఫ్రికా, నెదర్లాండ్స్ తదితర దేశాల పౌరులు కూడా ఉన్నారు.
రెస్క్యూ ఆపరేషన్ ముమ్మరం
వరద ప్రభావిత ప్రాంతాల్లో నేపాల్ ఆర్మీ, ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్, నేపాల్ పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. హెలికాప్టర్లు, డ్రోన్లను ఉపయోగిస్తూ గల్లంతైన వారి కోసం గాలింపు కొనసాగుతోంది. భారీ మట్టి, శిథిలాలు పేరుకుపోవడంతో సహాయక చర్యలకు ఆటంకాలు ఎదురవుతున్నాయి.
భారతీయుల కోసం హెల్ప్‌లైన్ నంబర్లు
నేపాల్‌లోని భారత రాయబార కార్యాలయం ప్రభావిత భారతీయుల కుటుంబాలు, బంధువుల కోసం అత్యవసర నంబర్లను ప్రకటించింది:
📞 +977 985 131 6807
📞 +977 970 910 7500
ఈ రెండు నంబర్లను WhatsApp ద్వారా కూడా సంప్రదించవచ్చు.
అదేవిధంగా నేపాల్ టూరిజం బోర్డు 1234, 1144, టూరిస్ట్ పోలీస్ నంబర్ 9851289445ను కూడా అత్యవసర సహాయం కోసం ప్రకటించింది.
బీహార్, యూపీలో హై అలర్ట్
నేపాల్ నుంచి ప్రవహించే నదుల ద్వారా వరద నీరు దిగువ ప్రాంతాలకు చేరే అవకాశం ఉండటంతో బీహార్, ఉత్తరప్రదేశ్ అధికారులు అప్రమత్తమయ్యారు. ముఖ్యంగా గండక్ నది పరివాహక ప్రాంతాల్లో పరిస్థితిని అధికారులు నిశితంగా పరిశీలిస్తున్నారు. లోతట్టు ప్రాంతాలు, నది తీర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
రెండో వరద ముప్పుపై హెచ్చరిక
ఎగువ ప్రాంతంలో నది మార్గంలో ఇంకా నీటి అడ్డంకి ఉండే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. దీంతో మరోసారి భారీగా వరద వచ్చే ప్రమాదం ఉందని, నదీ తీర ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే చర్యలు చేపడుతున్నట్లు సమాచారం.
ప్రధాని మోదీ స్పందన
నేపాల్‌లోని పరిస్థితిపై ప్రధాని నరేంద్ర మోదీ, నేపాల్ ప్రధాని బాలేంద్ర షాతో మాట్లాడారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలియజేసిన మోదీ.. నేపాల్‌కు అవసరమైన మానవతా, సహాయక చర్యల్లో భారత్ పూర్తి సహకారం అందించేందుకు సిద్ధంగా ఉందని హామీ ఇచ్చారు.











