అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన సన్నిహిత సహాయకురాలు నటాలీ హార్ప్‌కు 45 వేల డాలర్ల హాలిడే గిఫ్ట్ ఇచ్చినట్లు తాజాగా వెల్లడైన ఆర్థిక వివరాలు చెబుతున్నాయి.ట్రంప్ ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న హార్ప్ వార్షిక వేతనం సుమారు 1.5 లక్షల డాలర్లు. దీంతో ఈ గిఫ్ట్ ఆమె ఏడాది జీతంలో దాదాపు మూడో వంతు కావడం ఆసక్తికరంగా మారింది.

ఎవరీ నటాలీ హార్ప్?

ట్రంప్‌కు అత్యంత దగ్గరగా పనిచేసే సిబ్బందిలో హార్ప్ ఒకరు. అధ్యక్షుడికి వార్తా కథనాలు, సోషల్ మీడియా పోస్టులను ప్రింట్ చేసి అందించడం ఆమె బాధ్యతల్లో ఒకటి. దీంతో ఆమెకు “హ్యూమన్ ప్రింటర్” అనే మారుపేరు కూడా వచ్చింది.

మరికొందరు సిబ్బందికి కూడా

హార్ప్ ఒక్కరే గిఫ్ట్ అందుకోలేదు. వైట్ హౌస్ కమ్యూనికేషన్స్ అడ్వైజర్ మార్గో మార్టిన్, ఓవల్ ఆఫీస్ ఆపరేషన్స్ డిప్యూటీ డైరెక్టర్ ఛాంబర్లైన్ హ్యారిస్‌లకు కూడా 45 వేల డాలర్ల చొప్పున గిఫ్ట్‌లు అందినట్లు వెల్లడైంది.ఓవల్ ఆఫీస్ ఆపరేషన్స్ డైరెక్టర్ వాల్ట్ నౌటాకు 20 వేల డాలర్లు ఇచ్చినట్లు పేర్కొన్నారు.

గిఫ్ట్‌పై ఎందుకు చర్చ?

వైట్ హౌస్ ప్రకారం ఇవి వ్యక్తిగత హాలిడే గిఫ్ట్‌లు మాత్రమే. వీటికి అధికారిక విధులతో ఎలాంటి సంబంధం లేదని అధికారులు చెబుతున్నారు.అయితే ప్రభుత్వ ఉద్యోగులు అధ్యక్షుడి నుంచి ఇంత పెద్ద మొత్తంలో గిఫ్ట్‌లు అందుకోవడం నైతికంగా ఎలాంటి ప్రశ్నలకు దారితీస్తుందనే చర్చ మొదలైంది.

ప్రస్తుతం ఈ గిఫ్ట్‌లపై ఎలాంటి ఆరోపణలు నిర్ధారణ కాలేదు. కానీ భారీ మొత్తాలు బయటకు రావడంతో ట్రంప్‌కు అత్యంత సన్నిహితంగా పనిచేసే సిబ్బందితో ఆయనకున్న సంబంధాలు మరోసారి వార్తల్లోకి వచ్చాయి.