భారత్-ఆఫ్ఘనిస్థాన్ మధ్య రాజకీయ విశ్వాసం, ఆర్థిక భాగస్వామ్యం, నిరంతర దౌత్యపరమైన చర్చలు మరింత బలోపేతం కావాలని ఆఫ్ఘన్ ఛార్జ్ డి అఫైర్స్ నూర్ అహ్మద్ నూర్ అన్నారు. ఇరు దేశాల మధ్య బలమైన సంబంధాలు ద్వైపాక్షిక ప్రయోజనాలతో పాటు ప్రాంతీయ శాంతి, స్థిరత్వం, ఆర్థికాభివృద్ధికి దోహదం చేస్తాయని పేర్కొన్నారు.

గత కొన్నేళ్లుగా ఇరు దేశాల దౌత్య సంబంధాలు విస్తరించాయని, రాయబార కార్యాలయాలు, కాన్సులేట్లు మరింత చురుకుగా పనిచేస్తున్నాయని నూర్ తెలిపారు. రాజకీయ, ఆర్థిక, మానవతా రంగాల్లో నిర్మాణాత్మక అవగాహన పెరిగిందన్నారు.

భారత్, ఆఫ్ఘనిస్థాన్‌కు శతాబ్దాలుగా సాంస్కృతిక, వాణిజ్య సంబంధాలు ఉన్నాయని గుర్తుచేశారు. ఆఫ్ఘనిస్థాన్ అంతర్జాతీయ హక్కులను గౌరవించి, పరిరక్షించేందుకు భారత్ మద్దతు ఇవ్వాలని కోరారు.

సమతుల్య దౌత్యం, పరస్పర గౌరవం, జోక్యం చేసుకోకపోవడం, ఉమ్మడి ప్రయోజనాలే తమ విదేశాంగ విధానానికి ఆధారమని నూర్ స్పష్టం చేశారు. ఆఫ్ఘనిస్థాన్‌లో స్థిరత్వం కేవలం ఆ దేశానికే కాకుండా మొత్తం ప్రాంతంలో వాణిజ్యం, ఇంధనం, రవాణా, భద్రతకు అవకాశాలను పెంచుతుందని అన్నారు.