రష్యాపై ఉక్రెయిన్ భారీ డ్రోన్ దాడులతో విరుచుకుపడింది. యుద్ధం ప్రారంభమైన తర్వాత జరిగిన అతిపెద్ద వైమానిక దాడుల్లో ఇదొకటని రష్యా అధికారులు తెలిపారు. శనివారం రాత్రి నుంచి ఆదివారం ఉదయం వరకు దాదాపు వెయ్యి డ్రోన్లను ఉక్రెయిన్ ప్రయోగించినట్లు వెల్లడించారు.
రష్యా రక్షణ శాఖ ప్రకారం.. దేశవ్యాప్తంగా 822 డ్రోన్లను కూల్చివేశారు. వీటిలో సుమారు 600 డ్రోన్లు మాస్కో వైపు వచ్చినట్లు మేయర్ సెర్గీ సోబ్యానిన్ తెలిపారు. మాస్కో రీజియన్‌లో 201 డ్రోన్లను కూల్చినట్లు చెప్పారు.
పొడోల్స్క్‌లో డ్రోన్ ఓ ఇంటిని ఢీకొనడంతో 83 ఏళ్ల వ్యక్తి మృతి చెందగా.. పలువురు గాయపడ్డారు. వైల్డ్‌బెర్రీస్‌కు చెందిన భారీ గిడ్డంగితో పాటు మరో గిడ్డంగి కూడా ధ్వంసమయ్యాయి. గోడౌన్‌లో భారీగా మంటలు చెలరేగి.. దట్టమైన పొగలు ఆకాశాన్ని కమ్మేశాయి.
రోస్టోవ్ ప్రాంతంలోని మూడు పట్టణాలపై 150కి పైగా డ్రోన్లు దాడి చేయగా.. ఐదుగురు మృతి చెందారు. ఇళ్లు, రైల్వే స్టేషన్ దెబ్బతిన్నాయి.
మరోవైపు ఉక్రెయిన్‌పై రష్యా కూడా క్షిపణులు, డ్రోన్లతో దాడులు చేసింది. క్రివీ రిహ్‌లో ఇద్దరు, జపోరోజియా ప్రాంతంలో ఇద్దరు మృతి చెందగా.. పలువురు గాయపడ్డారు. దీంతో ఇరు దేశాల మధ్య దాడులు మరింత తీవ్రతరం అయ్యాయి.









